Congress Victory: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్ ఎస్ ని అధిగమించి ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఓట్ల లెక్కింపు సరళిని బట్టి కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. అంతా అనుకున్నట్టుగానే కాంగ్రెస్ తాజా ఫలితాల్లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఖాతా తెరచింది. ఇక్కడి నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆది నారాయణ విజయం సాధించారు.
ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేటలో తన సమీప బిఆర్ ఎస్ అభ్యర్థి పై దాదాపు 28 వేల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు. నారాయణ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. గతంలో నారాయణ తెలుగు దేశం పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందారు. అయితే అశ్వారావు పేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్వేషణ చేసిన క్రమంలో నారాయణను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వీరాభిమాని. ఆయన కారణంగానే నారాయణ కాంగ్రెస్ పార్టీ తరుపును అశ్వారావు పేట నుంచి ఎమ్యెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.
రెండవ విజయం కూడా కాంగ్రెస్‌దే..
అశ్వారావు పేటలో అభ్యర్థి విజయంతో ఖాతా తెరిచిన కాంగ్రెస్ రెండవ అభ్యర్థి విజయాన్ని కూడా సొంతం చేసుకుని రేసులో ముందు వరుసలో నిలిచింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా దూసుకుపోతోంది. అశ్వారావు పేటలో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ రెండవ విజయాన్ని కూడా దక్కించుకుంది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఇల్లెందు (ఎస్టీ) నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి భారాస అభ్యర్థి బానోతు హరి ప్రియ నాయక్‌పై ఘన విజయం సాధించారు.