JAISW News Telugu

Congress : కాంగ్రెస్ వీరి కొంప ముంచదు కదా?

Congress

Congress

Congress : ఏపీ రాజకీయాల్లోకి అనూహ్యంగా దూసుకొచ్చిన షర్మిల తనదైన శైలిలో దూకుడుగానే వెళ్తున్నారు. ఎవరికీ పట్టని ‘ప్రత్యేక హోదా’ విషయాన్ని ప్రజల్లోకి బాగానే తీసుకెళ్తున్నారు. ఇందుకు సొంత అన్న జగన్ పై కూడా నిప్పులు చెరుగుతున్నారు. అయితే ఈ విషయాన్ని జగన్ తొందరగానే గ్రహించారు. సొంత చెల్లి అని కూడా చూడకుండా తన మంత్రులు, ఎమ్మెల్యేల చేత ఎదురుదాడి చేయిస్తున్నారు. దీనివల్ల షర్మిలపై ప్రజల్లో సింపతీ వస్తుందని తెలిసి కూడా తీవ్ర విమర్శలు చేయిస్తున్నారు.

మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ఉడతభక్తి సాయం చేసింది. ఇక ఇక్కడ రేవంత్ రెడ్డి గురువు పార్టీకి కాంగ్రెస్ సాయం చేసే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వస్తున్నాయి. అయితే ఈ విషయం జగన్ కు కూడా తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ.. టీడీపీ, జనసేనలకు నిజంగా హెల్ప్ చేస్తుందా? లేదంటే ఆ పార్టీల ఓట్లను చీల్చి నష్టపరుస్తుందా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.

2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనే కాంగ్రెస్ పార్టీకి 1.17శాతం ఓట్లు వచ్చాయి. అది బీజేపీ కంటే కూడా ఎక్కువ. ఇప్పుడు వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వెల్లువిరుస్తోంది. అధికార పార్టీపై విరుచుకుపడుతూ ప్రజలను ఆకట్టుకున్నారు. అయితే ఎంతో కొంత అప్పటికంటే ఎక్కువ కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరిగే అవకాశమైతే ఉంది. మరి అది వైసీపీ ఓట్లను చీల్చడమే కాదు టీడీపీ, జనసేన ఓట్లను చీల్చే అవకాశం ఉంది.

ఏపీలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడానికి అగ్రనేతలు సైతం వస్తారు. కర్నాటక, తెలంగాణలో ప్రకటించినట్టుగా గ్యారెంటీలను ప్రకటిస్తారు. వాటికి కొందరు ఓటర్లు ఆకర్షితులు కావొచ్చు. ఇలా కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరగడం ఖాయం. అయితే ఇక్కడే టీడీపీ, జనసేన జాగ్రత్త పడాల్సి ఉంది. మిత్రపక్షంగానే ఉంటుంది కదా అని కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేస్తే తమ ఓట్లకే ఎసరు తెస్తుందని గుర్తెరగాలి. ఈ విషయంలో ముందే జాగ్రత్తపడితే మంచిది లేకుంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందం అన్నట్టుగా పరిస్థితి మారుతుంది.

Exit mobile version