KTR : కాంగ్రెస్ ది రైతు వ్యతిరేక పాలన: కేటీఆర్ – బోనస్ విషయంలో బోగస్ విధానాన్ని బయటపెట్టింది
KTR : కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు, రైతు వ్యతిరేక పాలన అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యుడు కేటీఆర్ (ట్విటర్) వేదికగా విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం తాజా కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యంగా సన్నవడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ప్రకటనపై ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఈ నిర్ణయం కపట కాంగ్రెస్ మార్కు మోసం.. దగా.. నయవంచన అని విమర్శించారు. గ్యారెంటీ కార్డులో ‘‘వరిపంటకు’’ రూ.500 బోనస్ అని ప్రకటించి.. ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే’’ అని సన్నాయి నొక్కులు నొక్కుతారా.? అంటూ విరుచుకుపడ్డారు. ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా..? ఇది ముమ్మాటికి రైతు వ్యతిరేక పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీది ఓట్లనాడు ఓ ముచ్చట.. నాట్లనాడు ఓ ముచ్చట అని ఎద్దేవా చేశారు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే రూ.2 లక్షల రుణమాఫీ అన్నారని, ఇంకా అమలు చేయలేదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ గాలిమాటలతో గారడీ చేసిందని, లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందని కేటీఆర్ విమర్శించారు.