Congress Strategy : మెదక్ తన ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహం..
రేవంత్ లక్ష్యం మేరకు కాంగ్రెస్ కేడర్ చాపకింద నీరులా పార్టీని మెదక్ లో విస్తరిస్తూ వెళ్తోంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ తరఫున ఆరుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఇక వారందరి మెజారిటీ దాదాపు 2 లక్షల పైనే ఉంది. అయినా బీఆర్ఎస్ పార్టీని తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. మెదక్ ఎంపీ సీటును ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో బలమైన అభ్యర్థిని దించాలని హస్తం పార్టీ భావిస్తోంది.
మెదక్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో సంగారెడ్డి, పటాన్‌చెరు, మెదక్, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి 3,16,427 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించాడు. కొత్త ప్రభాకర్ రెడ్డి కంటే ముందు కేసీఆర్, విజయశాంతి, ఆలె నరేందర్ గులాబీ టికెట్ నుంచే మెదక్ ఎంపీగా గెలిచారు. ఈ సారి అభ్యర్థి ఎవరనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ తరుఫున మైనంపల్లిని దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బహూషా దీని కోసమే కవచ్చు గతంలో సిద్దిపేటలో భారీ సభ నిర్వహించారు. ఇప్పుడు మైనంపల్లి కొడుకు రోహిత్‌రావు మెదక్ ఎమ్మెల్యేగా విజయం సాధించాడు.
హనుమంతరావు సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో పట్టు సాధించాలని అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. గజ్వేల్‌లో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన పాత వాళ్లను చేర్చుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ వైపునకు మొగ్గు చూపుతున్నారు. పటాన్‌చెరులో కాంగ్రెస్ ఓడిపోయినందున బలపడేందుకు ముదిరాజ్ సామాజిక తరగతిలో పట్టున్న నీలం మధును కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. ఇలా కాంగ్రెస్ ప్రతీ అంశాన్ని పరిగణలోకి తీసుకొంటూ వెళ్తుంది. ఈ సారి బీఆర్ఎస్ గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది.