KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర ఎన్నికల అధికారికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జి. నిరంజన్ ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. కేటీఆర్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల ప్రచారం ముగిసినా కేటీఆర్ నిశ్శబ్ధంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని తెలిసినా చాటుమాటుగా చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. వాటిని పాటించకుండా తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ నిర్వహించడం తప్పు కాదా అని అడుగుతున్నారు.
తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఎంతో చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. దీన్నే దీక్షా దివస్ గా జరుపుకోవడం మామూలే. కేటీఆర్ దిక్షా దివస్ రోజు రక్తదానం చేయడం ఏమిటని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటే ఓటర్లను ప్రభావితం చేసే కార్యకలాపాలు నిర్వహించడం గమనార్హం.
ఎన్నికల అధికారికి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపారు. కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు జరిగే సమయంలో ఇలాంటి పనులు చేయడం ఆయన స్థాయికి తగదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న కార్యకలాపాలపై నిరంజన్ ఫిర్యాదు చేయడంతో సంచలనంగా మారింది. దీనిపై ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు.