Danam Nagender : తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి రాహుల్ గాంధీకి గిఫ్ట్ గా ఇవ్వాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉవ్విళ్లూరుతోంది. దీనికోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ప్రధాన నేతలను కాంగ్రెస్ లో ఆకర్షిస్తోంది. సీనియర్ నేతలు కేకే, ఆయన కూతురు, కడియం శ్రీహరి, ఆయన కూతురు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక గతంలోనే పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. బీఆర్ఎస్ ముఖ్యనేతలపై గురిపెట్టింది. గ్రేటర్ పరిధిలోని కీలక నేతలతో టచ్ లోకి వెళ్లింది. గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి తో పాటుగా పలువురు ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈక్రమంలోనే దానం నాగేందర్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆయన్ను కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థిగా ప్రకటించింది. ఇదే సమయంలో దానంను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది.
దీనికి తొలుత అంగీకరించిన దానం ఇప్పటివరకు పదవికి రాజీనామా చేయలేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఉంటుందని దానంకు ఏఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. దీనికి దానం అంగీకరించడంతో మూడో జాబితాలో దానం పేరు ప్రకటించారు. కానీ, దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఇదే టైంలో దానంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
కోర్టు సైతం ఆయనకు నోటిసులు జారీ చేసింది. ఈ మొత్తం పరిణామాలను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం దానం నాగేందర్ ను సికింద్రాబాద్ అభ్యర్థిగా తప్పించాలని చూస్తున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఆయన స్థానంలో మరో అభ్యర్థి వైపు నాయకత్వం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ స్థానంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ బరిలో ఉన్నారు. ఈ స్థానంలో గెలవడం కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇక్కడ ఎవరికీ అవకాశం ఇస్తుందో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావుతో పాటు ఓ మాజీ మంత్రి పేరును పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈరోజు లేదా రేపు అభ్యర్థిపైన స్థానిక నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈలోగా దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఆయన్ను కొనసాగించడం.. లేదంటే మరో అభ్యర్థిని ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.