Lok Sabha Elections 2024 : హైదరాబాద్ మాజీ మేయర్, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సహా ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి చెందిన ఐదుగురు నేతలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీకి ఊపు వచ్చింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడంతో వీరి చేరిక గ్రేటర్ తో పాటు చుట్టు పక్కల ప్రాతంలో బలోపేతమైంది. లోక్ సభ ఎన్నికలకు కొద్ది వారాల సమయం నేపథ్యంలో మరి కొంత మంది బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీలోకి ఫిరాయించి టిక్కెట్లు దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజధానితో పాటు చుట్టు పక్కల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దగా రాణించకపోవడంతో కాంగ్రెస్, టీడీపీకి చెందిన పలువురు నేతలను బీఆర్ఎస్ తమ పార్టీలోకి తీసుకుంది. అప్పుడు బీఆర్ఎస్ అనుసరించింది ఇప్పుడు కాంగ్రెస్ అనుసరిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతకు ముందు సునీతా రెడ్డి తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావుకు పంపారు. ఫిబ్రవరి 8వ తేదీ మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి రేవంత్ రెడ్డిని కలిశారు. మహేందర్ రెడ్డి కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 3 నెలల ముందు గతేడాది ఆగస్ట్ లో అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మహేందర్ రెడ్డిని మంత్రిని చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఆశిస్తున్న ఆయనను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ చేసిన ప్రయత్నమే ఆయన చేరికకు కారణం అని తెలుస్తోంది. మహేందర్ రెడ్డికి, అప్పటి తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మధ్య సయోధ్య కుదిర్చేందుకు బీఆర్ఎస్ నాయకత్వం చర్యలు చేపట్టింది. 2018లో తాండూరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన రోహిత్ రెడ్డి కొన్ని నెలలకే బీఆర్ఎస్ (టీఆర్ఎస్)లోకి ఫిరాయించినప్పటి నుంచి వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2018 వరకు మహేందర్ రెడ్డి మంత్రిగా పనిచేశారు. టీఆర్ఎస్ లో చేరక ముందు టీడీపీలో ఉన్నారు. 1994, 1998, 2009లో తాండూరు నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరి తాండూరు నుంచి ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో బీఆర్ఎస్ ఆయనను శాసన మండలి సభ్యుడిని చేసింది. 2021లో స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి తిరిగి మండలికి ఎన్నికయ్యారు.
ఫిబ్రవరి 11న బొంతు రామ్మోహన్ కూడా రేవంత్ రెడ్డిని కలిశారు. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. 2019లో రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 2 రోజులకే రేవంత్ రెడ్డితో రామ్మోహన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2016 నుంచి 2021 వరకు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ గా ఫసియొద్దీన్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నటుడు అల్లు అర్జున్ కు మామ. చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. బీఆర్ఎస్ నాయకత్వం టికెట్ నిరాకరించడంతో ఆయన దూరంగా ఉంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితారెడ్డి కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వదన్న సంకేతాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు గతేడాది జూలైలో కృష్ణారెడ్డి, అనితారెడ్డి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. అయితే వారు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు.
మహేశ్వరం నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించడంతో కృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కృష్ణారెడ్డిపై పోటీ చేసిన ఆమె 2019లో మరికొందరు కాంగ్రెస్ నేతలతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి సీఎం కేసీఆర్ ఆమెకు క్యాబినెట్ బెర్త్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కృష్ణారెడ్డి 2002 నుంచి 2007 వరకు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా పని చేశారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) చైర్మన్ గా కూడా పనిచేశారు.
2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడినప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డిపై విజయం సాధించారు. అయితే ఎన్నికలు జరిగిన కొన్ని నెలలకే ఆయన మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు.