Seethakka:ములుగు అనగానే చాలామందికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క గుర్తుకువస్తుంది. సీతక్క అని ముద్దుగా పిలుచుకునే ధనసరి అనసూయ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు. ఆదివాసి ఆడబిడ్డ అయిన ఆమె 33,700 ఓట్ల మెజారిటీతో గెలుపొంది అద్భుతమైన హ్యాట్రిక్ సాధించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కాంగ్రెస్ నాయకురాలు సీతక్క గతంలో మావోయిస్టు దళంలో పనిచేసింది. వరుసగా ములుగు నియోజక వర్గం నుంచి మూడోసారి విజయం సాధించిన సీతక్క తెలంగాణ మంత్రి వర్గంలో చోటు దక్కించుకుంది. ఒకప్పుడు తుపాకీ పట్టుకున్న ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టడం అనేది చారిత్రాత్మకం.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్తలు వెలువడినప్పటి నుంచి మంత్రి వర్గంలో సీతక్క పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఉప ముఖ్యమంత్రి పదవికి సీతక్క పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా, దానికి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి స్థానానికి ముందు నుంచి పోటీపడిన వారిలో మల్లు భట్టి కూడా ఒకరు. ఒకవేళ తాను డిప్యూటీ సీఎం కావడానికి అంగీకరిస్తే.. తానొక్కడే డిప్యూటీ కావాలని డిమాండ్ చేశారట. దాంతో సీతక్క డిప్యూటీ సీఎం అనే ప్రతి పాదనపై రేవంత్‌తో పాటు అధిష్టానం వెనక్కి తగ్గినట్టుగా తెలిసింది.
తెలంగాణ గిరిజనుల గుండెకాయ అయిన వరంగల్ జిల్లా సమీపంలోని ములుగు నుంచి సీతక్క వరుసగా మూడోసారి విజయం సాధించారు. ఇది ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్ అయిన స్థానం. ఆమె బీఆర్‌ఎస్ అభ్యర్థిపై 33,700 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సీతక్కది ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామం. నియోజక వర్గంలో 75 శాతం మంది గిరిజనులు దట్టమైన అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నవారే. వారి కోసమే రాజకీయాల్లోకి ప్రవేశించిన సీతక్క అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు మంత్రి పదవిని దక్కించుకున్నారు.
పూలన్ దేవి స్ఫూర్తితో…
నక్సలైట్లు, గిరిజనులు ముద్దుగా ఆమెను ‘అక్కా’ అని పిలుస్తారు. 1980లలో చాలా మంది యువతీ యువకులు నక్సలైట్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత సీతక్క `పూలన్ దేవి` సాహసాల స్ఫూర్తితో దోపిడీదారు వ్యవస్థపై తిరుగుబాటు బావుటా ఎగురువేసి విప్లవోద్యమం వైపను అడుగులు వేశారు. ధనసరి అనసూయ 1988లో నక్సలైట్ ఉద్యమంలోకి ప్రవేశించింది. అనతికాలంలోనే దళం నాయకురాలిగా, గ్రూప్ కమాండర్‌గా మారింది. నక్సలైట్ ఉద్యమంలో పాల్గొన్న ఆమె సోదరుడు, భర్త పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
జనజీవన స్రవంతిలోకి..
మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాని నందమూరి తారక రామారావు పలుపునిచ్చారు. తెలిసీ తెలియని వయసులో అమాయకత్వంలో తప్పుదారి పట్టిన యువతలో కొందరు నేటికీ నిషేధిక మావోయిస్టు సంస్థలో కొనసాగుతున్నారని వారు వెంటనే జన జీవన స్రవంతిలో కలవాలని అడవుల్లో కుటుంబాలను విడిచి అనారోగ్యాల పాలవుతూ సాధించేది ఏమీ లేదని, ప్రశాంతమైన జీవనాన్ని గడపడానికి ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తుందని ఆనాటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు పిలుపు నిచ్చారు. దళంలో దాదాపు రెండు దశాబ్దాల పాటు గడిపిన సీతక్క దళకమాండర్ నక్సల్ నాయకుడిని వివాహం చేసుకున్నారు. వారికి ఓ కొడుకు. ఆ సమయంలోనే సీతక్క పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు.
రాజకీయ జీవితం…
పోరు బాటను వీడిన సీతక్క..రాజకీయ రంగ ప్రవేశం చేసింది. అదే సమయంలో ఆమె గురించి తెలిసిన చంద్రబాబు ఆమెకు పార్టీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ములుగు నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదెం వీరయ్యపై పోటీ చేసి ఓటమి పాలైంది. అయితే ఆ తరువాత 2009లో జరిగిన ఎన్నికల్లో మహాకూటమి తరుపున తెలుగు దేశం అభ్యర్థిగా పోటీకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్యపై గెలుపొందింది. 20014లో వరుసగా మూడవసారి టీడీపీ అభ్యర్థిగా పోటీపడి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓటమి పాలైంది. ఆ తరువాత టీడీపీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి టీఆర్ ఎస్ అభ్యర్థి అజ్మీరా చందూలాల్‌పై 22.671 ఓట్ల మెజారిటీతో గెలిచింది. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి పోటీచేసి బీఆర్ ఎస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించి రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పదవి దక్కించుకోవడం విశేషం.