Congress Manifesto Released : కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల.. ఆవిష్కరించిన ఏఐసీసీ చీఫ్
Congress Manifesto Released : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. మాజీ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని మ్యానిఫెస్టో కమిటీ వివిధ వర్గాలను సంప్రదించి, ఈ మ్యానిఫెస్టోను సిద్ధం చేసింది. గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో అభయహస్తం పేరిట ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం 42 పేజీలతో, 62 ప్రధాన హామీలు ఈ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ప్రజాకర్షక పథకాలను ఇందులో పెట్టినట్లు నేతలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటు ఈ మ్యానిఫెస్టోను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇంత పెద్ద మ్యానిఫెస్టో డిక్లరేషన్ చేసినట్లు చెప్పారు. కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా కీలక నేతలందరూ హాజరయ్యారు. దళితులు, బడుగు, బలహీనవర్గాలు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలను సంప్రదించి, ఈ మ్యానిఫెస్టోను సిద్ధం చేసినట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. అన్ని వర్గాలకు మేలు చేకూరేలా అభయహస్తం మ్యానిఫెస్టోను తెలంగాణ జాతికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదని, ధనిక రాష్ర్టాన్ని దివాళా తీయించిందని మండిపడ్డారు. అహంకార పాలనను గత పదేళ్లుగా తెలంగాణ సమాజం చవిచూసిందని, బడుగు బలహీన వర్గాల పరిస్థితులు మరింత దిగజారయాని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ సునామీలా ముందుకు రాబోతున్నదని, ఇందిరమ్మ రాజ్యం ఏర్పడబోతున్నదని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి , కాంగ్రెస్ రాష్ర్ట ఇన్ చార్జి మాణిక్ రావ్ ఠాక్రే పాల్గొన్నారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ముందుకువెళ్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. రైతులు, అమరవీరులు అన్ని కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. ఇది పీపుల్స్ మ్యానిఫెస్టో అని చెప్పుకొచ్చారు. జర్నలిస్టులకు కూడా మేలు చేసేలా ఈ మ్యానిఫెస్టో రూపొందించామని, ఇంటింటికీ చేర్చే బాధ్యత పార్టీ శ్రేణులు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ర్ట సంపదను ప్రజలకు పంచడంలో అందరం ఏకంగా ముందుకెళ్దామని కోరారు.