Amit Shah : అబద్ధాలతో కాంగ్రెస్ గెలవాలని ప్రయత్నిస్తోంది – కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Amit Shah : కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో గెలవాలని ప్రయత్నిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. భువనగిరిలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాహుల్ పిల్ల చేష్టల గ్యారంటీలు.. మోదీ గ్యారంటీల మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకట్లేదని ఎద్దేవా చేశారు. మోదీ ఏం చెబుతారో దానిని తప్పకుండా చేస్తారని, రాహుల్ ఇచ్చిన గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి లేదని అన్నారు.
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ అమలు కాలేదు. వారికి ఏటా రూ. 15 వేలు ఆర్థిక సాయం అందించలేదు. వరి, గోధుమలకు రూ. 500 బోనస్ అందించలేదు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎన్నటికీ నెరవేర్చదని, ఆ పార్టీ 70 ఏళ్లుగా అయోధ్య విషయాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్,మజ్లిస్ మధ్య త్రికోణ బంధం ఉందని, ఆ మూడు పార్టీలు హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించవని అన్నారు. రద్దు చేసిన ట్రిపుల్ తలాక్ ను పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నాయని అమిత్ షా తెలిపారు.