Congress : లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వలసలు, చేరికలతో పార్టీల్లో హడావిడి నెలకొంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ తీవ్రంగా వలసల బెడదను ఎదుర్కొంటోంది. కెకె, కడియం వంటి సీనియర్లు కూడా పార్టీని వీడడం చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ , బీజేపీల్లోకి బీఆర్ఎస్ నుంచి నేతలు క్యూ కడుతుండడంతో కారు పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది.
ఈనేపథ్యంలో శ్రేణుల్లో భరోసా నింపడానికి, లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొనడానికి జిల్లాల పర్యటనలకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. నీరు అందక ఎండిపోతున్న పంటలను పరిశీలించడానికి ఉద్దేశించిన పర్యటనలు ఇవి. కరువు బారిన పడ్డ రైతన్నలను పరామర్శించడం, వారిలో ధైర్యం నింపడానికి ఆయన ఈ పర్యటన చేపట్టారు.
రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలు మే 13వ తేదీన పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఒకే విడతలో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలుచుకుని రాహుల్ గాంధీకి గిఫ్ట్ గా ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే 13 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కూడా. 8వ జాబితాలో నలుగురి పేర్లను ప్రకటించింది. 8వ జాబితాలో నలుగురి పేర్లను ప్రకటించింది. నిజామాబాద్- టి.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్- ఆత్రం సుగుణ, మెదక్- నీలం మధు, భువనగిరి- చామల కిరణ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్.
మిగిలిన నాలుగు లోక్ సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఈ సాయంత్రానికి ఖరారు చేసే చాన్స్ ఉంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలు అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దని భావిస్తోంది. ఈ నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడానికి దేశ రాజధానిలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ దీనికి అధ్యక్షత వహించారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, స్టేట్ ఇన్ చార్జి దీపాదాస్ మున్షి హాజరయ్యారు. నేడో, రేపో ఈ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. డబుల్ డిజిట్ సీట్లలో గెలిచేందుకు కాంగ్రెస్ లో తలమునకలైంది.