Harish Rao : కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఒకే ఒక హామీని నెరవేర్చిందని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆయన హనుమకొండలో ప్రసంగించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఒకే ఒక హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిందని, అది కూడా తుస్సేనని ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. అందుకోసం అసెంబ్లీ, కౌన్సిల్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పోరాడతామని చెప్పారు. నారాయణఖేడ్ లో ఉపాధ్యాయులపై లాఠీఛార్జి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆత్మ గౌరవాన్పి దెబ్బతీసిందని పేర్కొన్నారు.
నిరుద్యోగ భృతిపై నిలదీస్తే, అలా చెప్పలేదని అసెంబ్లీలో భట్టి విక్రమార్క అంటున్నారు. కరెంటు బిల్లులు, భూముల రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడానికి సిద్ధమవుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఒకవైపు సంక్షేమానికి కోతలు.. మరో వైపు వాతలా..? అన్ని వర్గాలను మోసం చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది. అందుకే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెపితే కాంగ్రెస్ దారికొస్తుందని హరీశ్ రావు అన్నారు.