Free Electricity : తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది. అందులో 200 యూనిట్ల లోపు విద్యుత్ ను వాడుకునే వారికి ఉచితంగా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు షురూ చేసింది. దీన్ని అమలు చేయడం వల్ల కలిగే పరిణామాల గురించి ఆరా తీస్తున్నారు.
కర్ణాటకలో ఇంతకు ముందు నుంచే ఈ పథకం రన్ చేస్తుండటంతో అక్కడ ఎలాంటి విధానాలు అవలంభిస్తున్నారో తెలుసుకునేందుకు మంత్రులు, అధికారులు బెంగుళూరు వెళ్లి సమీక్షించారు. నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఇందులోని లోపాలు, సాధ్యాసాధ్యాల గురించి చర్చించి పథకం అమలు చేయాలని భావిస్తోంది. దీని కోసమే ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. ఉచిత విద్యుత్ పథకం చేపడితే వచ్చే పరిస్థితులను ఆరా తీస్తోంది.
తెలంగాణ ఐఏఎస్ అధికారి ముషారఫ్ ఫారూఖీ, బెస్కామ్ ఎండీ మహలేష్జిలాగి, డైరెక్టర్ ఫైనాన్స్ ధర్ జన్ జె, ఐటీ, రెవెన్యూ అధికారులతో చర్చించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని భావిస్తోంది. దీనికి ప్రభుత్వానికి ఏటారూ. 4 వేల కోట్ల భారం పడనుంది. దీంతో పథకం సాధ్యాసాధ్యాలపై అందరితో చర్చిస్తోంది. ఉచిత విద్యుత్ పథకానికి మార్గాలను అన్వేషిస్తోంది.
కర్ణాటకలో కోటి 65లక్షల మందికి ఈ పథకం వర్తింపచేస్తున్నారు. దీనికిగాను అక్కడి ప్రభుత్వం సంవత్సరానికి రూ. 13,910కోట్లు కేటాయించింది. ఈ లెక్కన తెలంగాణ ప్రభుత్వానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తున్నారు. ఉచిత విద్యుత్ పథకంతో ఎదురయ్యే ఇబ్బందులు కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి అయ్యే వ్యయప్రయాసలను గురించి అధ్యయనం చేస్తోంది. అర్హులందరికి వర్తింపచేసి తను ఇచ్చిన మాటను నిలుపుకోవాలని భావిస్తోంది.