Bandi Sanjay MP Elections : లోక్ సభ ఎన్నికలు మరో రెండు, మూడు నెలల్లోనే ఉండడంతో తెలంగాణలో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఈ ఎన్నికలు మూడు పార్టీలకు కీలకం కావడంతో గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని చూస్తాయి. కానీ అధికార కాంగ్రెస్ మాత్రం కరీంనగర్ స్థానంలో డమ్మీ అభ్యర్థిని పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీయడానికి రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో చేతులు కలిపినట్లు ఆ పార్టీల నేతల వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది.
కరీంనగర్ సిట్టింగ్ అయిన బండి సంజయ్ కు రాబోయే ఎన్నికల్లో కూడా సీటును బీజేపీ అధిష్ఠానం దాదాపు ఖాయం చేసినట్టే. అయితే పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలా మట్టుకు వ్యతిరేకిస్తున్నా హైకమాండ్ బండినే ఖరారు చేయడం ఖాయమే. ఇక బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ బరిలో ఉండనున్నట్లు కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఇక కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీలో ఉంటారన్నది ఇంకా ప్రకటించలేదు.
అయితే ఇద్దరు బలమైన అభ్యర్థులు ఉన్నచోట జాతీయ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థినే నిలబెట్టాలి. అయితే ఇక్కడ కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని నిలబెడితే పరోక్షంగా బీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూరుతుందనే అంచనాతో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టి బీజేపీకి సహకరించాలన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇక్కడ గతంలో ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన పురుమల్ల శ్రీనివాస్ లేదా వెలిచాల జగపతిరావు కుమారుడు రాజేందర్ రావుకు సీటు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటైనట్లు ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ తమ పార్టీ ఓట్లను బీజేపీకి మరలించారని అంటుంటారు. దీంతో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఓడిపోయి సంజయ్ గెలిచారు. ఆ తర్వాత మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నం హుస్నాబాద్ కు షిఫ్ట్ కావడంతో పురుమల్ల శ్రీనివాస్ కు అసెంబ్లీ సీటు ఇచ్చారు. ఇద్దరు బడా నేతల మధ్య ఓ మాములు అభ్యర్థికి సీటు ఇవ్వడమేంటనే మాటలు వినపడ్డాయి.
ఇక రేపు జరుగబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థినే నిలబెట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికిని లేకుండా చేయాలని జాతీయ పార్టీల వ్యూహంలో భాగంగా..ఇక్కడ బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి బలమైన నేతను ఓడించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ కు పరోక్షంగా సహకరించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే సమయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి. ‘‘బీఆర్ఎస్ ను ఖతం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేయాలి’’ అని ఇటీవల బండి సంజయ్ పిలుపునివ్వడం గమనార్హం.