Ramu Venigalla : న్యూజెర్సీలో రాము వెనిగళ్ల అభినందన సభ.. పొల్గొన్న డా.జై గారు.. తరలివచ్చిన జనవాహిని
Ramu Venigalla : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నారైగా ఉన్న రాము వెనిగండ్ల కృష్ణా జిల్లా గుడివాడ నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరపున కూటమి అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా అమెరికాలోని న్యూజెర్సీకి వచ్చిన ‘రాము వెనిగళ్ల’కు అక్కడి తెలుగు వారు ఘనస్వాగతం పలికారు. న్యూజెర్సీలోని ఎన్నారై తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ అభినందన సభ జరిగింది. వందలాది మంది ఎన్నారైలు అభినందన సభకు హాజరయ్యారు. చాలా మంది కుటుంబ సమేతంగా రావడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక సంక్త్రాంతి రెస్టారెంట్ బాంక్వెట్ హాల్ లో శ్రీనివాస్ నిమ్మగడ్డ ఆధ్వర్యం లో రాము సంబరాలు పేరిట ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు.
తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రుల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు, నందమూరి హరికృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ‘రాము వెనిగళ్ల’ వేదికను అలంకరించారు. ఈ కార్యక్రమంలో ‘తానా’ తాజా మాజీ అధ్యక్షుడు అంజయ చౌదరి లావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘రాము వెనిగళ్ల’ మాట్లాడుతూ ఎన్నారైల ఆత్మీయ ఆతిథ్యం మరువలేనిదన్నారు. అమెరికాలో తెలుగు జాతికి సేవ చేస్తూనే మరోవైపు జన్మభూమి ప్రగతికి సహకరిస్తున్న ఎన్నారైల సేవలు మరువలేనివని, తన గెలుపులో ఎన్నారైలు కూడా కీలక పాత్ర పోషించారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు. వివిధ రంగాలకు అనుకూలమైన అవకాశాలు, మానవ వనరులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నందున ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర ప్రగతికి తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారైలు మాట్లాడుతూ గత ప్రభుత్వ దౌర్జన్యం, ఆక్రమణ, అవినీతిని ప్రజలు సహించలేక సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నారు. ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు చెప్పిన విషయాలను వివరించి, ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నారైలందరూ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి రాష్ట్ర ప్రగతికి ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూబ్లడ్ ఫౌండర్ డా.జై,జగదీష్ బాబు యలమంచిలి గారు, వారి తండ్రి గారు, తానా మాజీ ప్రెసిడెంట్ లావు అంజయ్య చౌదరి, తానా–రాజా కసుకుర్తి, ఎన్ఆర్ఐ టీడీపీ అభిమాని వంశీ వెనిగెళ్ల, యూ బ్లడ్ కో ఆర్డినేటర్ రమేశ్ రాయల, నాట్స్ – శ్రీహరి మందాడి, ఎన్నారై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల, తదితరులు పాల్గొన్నారు. చివరగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.