CM Chandrababu : ఉచిత ఇసుక విధానంపై ఫిర్యాదులు.. సీఎం చంద్రబాబు ఆగ్రహం
CM Chandrababu : ఎన్డీయే ప్రభుత్వం ఉచిత ఇసుక లక్ష్యం నెరవేరి తీరాలని సీఎం చంద్రబాబు మంత్రులకు తేల్చి చెప్పారు. కేబినెట్ సమావేశం అనంతరం ఉచిత ఇసుక విధానంపై మంత్రులతో ఆయన కీలకంగా చర్చించారు. ఉచిత ఇసుక విధానంపై ఫిర్యాదులు రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజుల్లో మార్పు రాకుంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఏ స్థాయిలో తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక విరివిగా దొరకాలన్నారు. అన్ని బంధనాలు తొలగించి, రవాణా, తవ్వకం ఛార్జీలు కూడా వీలైనంత తక్కువ ధర ఉండేలా చర్యలు తీసుకుంటూ ఉచిత ఇసుక అందించి తీరాలని తేల్చి చెప్పారు. ఇసుక తవ్వుకుని తీసుకెళ్తే రుసుము వసూలు చేయవద్దని సీఎం ఆదేశించారు. ఇసుక అక్రమాలు జరగకుండా ఇన్ చార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఆంక్షల పేరుతో అధికారులు వేధిస్తున్నారని ఈ సందర్భంగా కొందరు మంత్రులు సీఎం దృష్టికి తెచ్చారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తాయని, ఇకపై అలా ఉండకూడదని సీఎం వివరించారు.