JAISW News Telugu

Tragedy : మానవత్వం మంటగలిచిపోయింది.. ఫొటోల కోసం పోటీ.. ఆసుపత్రి వెళ్లేలోపే బాధితుడి మృతి!

Tragedy : సాధారణంగా ఎక్కడన్న రోడ్డు ప్రమాదం జరిగిందంటే చాలు ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం కామన్ అయిపోయింది. ఆ ప్రమాదంలో చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉన్నా సరే వాళ్ల వ్యూస్.. పాపులారిటీ కోసం వీడియోలు తీస్తూనే ఉంటారు. అందులోనూ ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండడంతో అలాంటి సంఘటనలు వెంటనే కెమెరాల్లో బంధిస్తున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఈ కల్చర్ రానురాను మరీ తీవ్రంగా మారిపోయింది. ఒక మనిషి ప్రాణాపాయంలో ఉంటే అది మరిచిపోయిన ఫోన్ లలో షూట్ చేస్తూ శునకానందం పొందుతున్నారు.

అలా ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. తీవ్ర రక్తస్రావం అయింది. ఆస్పత్రికి తీసుకెళ్లాలని వేడుకున్నా.. చుట్టుపక్కల వారు సాయం చేయలేదు. 108 వాహనం వచ్చే వరకు.. ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ గడిపారు. కొద్దిసేపటి తర్వాత 108 వచ్చేసరికి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. కీసర సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్‌కు చెందిన వి.ఏలేందర్ కీసర సమీపంలోని రాంపల్లి చౌరస్తాలో నివసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం కీసరలో నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటీపై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఎలేందర్ రోడ్డుపై పడిపోగా.. స్థానికులు గమనించి కేకలు వేశారు. దీంతో డ్రైవర్ ఒక్కసారిగా లారీని రివర్స్ చేయడంతో లారీ చక్రాలు ఎలేందర్ కాళ్లపై నుంచి వెళ్లాయి.

ఈ క్రమంలో రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయి తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఎలేందర్ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వేడుకున్నాడు. చుట్టుపక్కల గుమిగూడిన వ్యక్తులు 108కి సమాచారం అందించి బాధితుడి ఫొటోలు, వీడియోలు తీస్తూనే ఉన్నారు. కొద్దిసేపటికి 108 వాహనం వచ్చి ఈసీఐఎల్‌ కూడలిలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే బాధితుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏలెందర్ కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. లారీ డ్రైవర్ లక్ష్మణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version