BCCI : టీ 20 ప్రపంచకప్ విజయోత్సవ సంబరాలకు తరలిరండి.. బీసీసీఐ
BCCI : టీ 20 క్రికెట్ లో ప్రపంచ కప్ గెలిచిన టీం ఇండియా సగర్వంగా భారత గడ్డపై గురువారం ఉదయం అడుగు పెట్టనుంది. వెంటనే ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీని కలిసిన అనంతరం జట్టు సభ్యులు గెలుపు సంబరాలు చేసుకోవడానికి ముంబయికి చేరుకుంటారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ముంబయిలోని మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు.
ఈ విజయోత్సవ సంబరాల్లో అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జులై నాలుగు సాయంత్రం 5.00 కు విజయోత్సవ యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపాడు. అందరూ డేట్ టైం సేవ్ చేసుకుని మరిచిపోకుండా సంబరాల్లో పాల్గొనాలని క్రికెట్ ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ఇండియా నాలుగు సార్లు ఐసీసీ వరల్డ్ కప్ టైటిల్స్ సాధించింది.
టీం ఇండియా 1983 వన్డే వరల్డ్ కప్ కపిల్ దేవ్ నేతృత్వంలో గెలవగా.. 2011 లో ఎంఎస్ దోని సారథ్యంలో ముంబయిలో విజయం సాధించింది. అయితే 2007 లోనే ప్రారంభమైన పొట్టి ప్రపంచకప్ దోని సారథ్యంలోనే గెలవగా.. 17 ఏండ్ల తర్వాత తిరిగి టీ 20 వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచింది. రోహిత్ శర్మకు ఇది రెండో టీ 20 వరల్డ్ కప్ కాగా.. విరాట్ కు మొదటిది. విరాట్ 2011 వన్డే వరల్డ్ కప్, 2024 టీ 20 ప్రపంచకప్ జట్టులో సభ్యుడు కాగా.. మిగతా ప్లేయర్లందరూ మొదటి సారి వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో సభ్యులుగా ఉన్నారు.
ఈ ప్రపంచ కప్ సిరీస్ లో బౌలింగ్ విభాగంలో అర్షదీప్ సింగ్ ఎక్కువ వికెట్లు (17) తీయగా.. జస్ ప్రీత్ బుమ్రా (16) వికెట్లు తీశాడు. బుమ్రా కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లభించగా.. ఫైనల్లో 76 పరుగులు చేసిన విరాట్ కొహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతమైంది. మూడు రోజుల కిందటే ఇండియాకు రావాల్సిన జట్టు సభ్యులు బార్బడోస్ లో తుఫాన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. దీంతో తుఫాను కాస్త తగ్గగానే బీసీసీఐ క్రికెట్ ప్లేయర్లందరి కోసం స్పెషల్ ప్లైట్ వేసి తీసుకొచ్చింది. ఇక ముంబయి లో సంబరాలు చేసుకోవడమే మిగిలింది. 13 ఏండ్ల తర్వాత ఐసీసీ వరల్డ్ కప్ గెలవడంతో నిజంగా అంతా కలలాగా ఉందని రోహిత్ శర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు.