Minister Roja : పదవి ఇప్పిస్తానని రూ.40లక్షలు వసూలు చేశారు..మంత్రి రోజాపై మహిళా నేత సంచలన ఆరోపణలు..


Minister Roja : ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఎదుటి పార్టీలను తిట్టాలంటే తొలి ప్రెస్ మీట్ రోజాదే అయ్యుంటుంది. అలాగే ప్రత్యర్థి పార్టీలు కూడా ఆమెనే ఎక్కువగా టార్గెట్ చేస్తుంటాయి. ఒక్కొక్కసారి రోజా విమర్శలు శ్రుతిమించుతుంటాయి కూడా.. అయితే ఈ సారి రోజాకు సొంత అనుచర వర్గం నుంచే పెద్ద ఆరోపణ ఎదురైంది. రోజాపై ఓ మహిళా నేత సంచలన ఆరోపణలు చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

పుత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ లో 17వ వార్డు కౌన్సిలర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు భువనేశ్వరి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆమె జనరల్ వార్డులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మునిసిపల్ చైర్మన్ పదవి ఎస్సీకి రిజర్వ్ కావడంతో భువనేశ్వరికే చైర్మన్ పదవి కట్టబెడుతామని రోజా హామీ ఇచ్చారని భువనేశ్వరి ఆరోపిస్తున్నారు. మిగిలిన అన్న కుమారస్వామితో మాట్లాడాలని చెప్పారని భువనేశ్వరి తెలిపారు.

వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి చేస్తున్న ఆరోపణల ప్రకారం.. ఆమె మంత్రి రోజా అన్న కుమారస్వామిని కలిశారు. ముందుగా ఆయన మున్సిపల్ చైర్మన్ పదవికి రూ.70లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య బేరం 40లక్షలకు కుదిరిందని భువనేశ్వరి చెప్పారు. రెండు దఫాలలో కుదుర్చుకున్న మొత్తాన్ని కుమారస్వామికి అందించానన్నారు.

మున్సిపల్ ఎన్నికలు జరిగి మూడు ఏండ్లు గడుస్తున్నా రెండో దఫా చైర్మన్ ఇస్తామని చెప్పిన మాట నేటికీ నెరవేర్చలేదని, తనకు అవకాశం ఇవ్వాలని పలు మార్లు ఆయన్ను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని, రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని భువనేశ్వరి వాపోయారు.

అయితే నేడు కొత్త స్వరానికి తెరలేపారని, ఎన్నికల తర్వాత చైర్మన్ పదవి కట్టబెడుతామని మాయమాటలు చెప్తున్నారని భువనేశ్వరి తెలిపారు. ఎన్నికల అనంతరం తమకు అవసరం లేదని స్పష్టం చేశామని ఆమె పేర్కొంది. ఇప్పుడే తమ  అమౌంట్ తమకు ఇవ్వాలని ఆయన్ను అడిగినా స్పందించడం లేదన్నారు. రోజాకు మెసేజ్ చేసినా, కలిసినా ఏ స్పందన లేదన్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రిపై పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారా? అని ప్రశ్నించారు. దళిత మహిళకు న్యాయం చేయాలని సీఎం జగన్ అన్నను కోరుతున్నట్లు తెలిపారు. అయితే భువనేశ్వరి ఆరోపణలపై మంత్రి రోజా స్పందించాల్సి ఉంది.

TAGS