JAISW News Telugu

AFG Vs SA : కుప్పకూలిన అఫ్గానిస్తాన్.. దక్షిణాఫ్రికాపై సెమీలో ఘోర ఓటమి

AFG Vs SA

AFG Vs SA

AFG Vs SA : ఎన్నో ఆశలతో ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ కు చేరిన అఫ్గానిస్తాన్ కు దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ట్రినిడాడ్ పిచ్ పై మొదట టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ తప్పిదమే వారి కొంప ముంచింది. పిచ్ పై బౌన్స్ ను క్యాష్ చేసుకున్న సౌతాఫ్రికా బౌలర్లు ఫస్ట్ ఓవర్ నుంచి అఫ్గాన్ బ్యాటర్లను బెంబేలెత్తించారు.

 ముఖ్యంగా మార్కో జన్ సేన్ బౌలింగ్ లో నిప్పులు చెరిగాడు. ఫామ్ లో ఉన్న రహ్మనుల్లా గుర్బాజ్ ను ఖాతా తెరవకుండానే మొదటి ఓవర్ లోనే పెవిలియన్ బాట పట్టించాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం కూడా 2 పరుగులకే అవుట్ కావడం వల్ల అఫ్గాన్ బ్యాటర్లు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు.  దీంతో మొదటి ఇన్సింగ్స్ లో 11.5 ఓవర్లలో  56 పరుగులకే ఆలౌట్ అయి సెమీస్ లో చెత్త రికార్డును మూట గట్టుకుంది. అఫ్గాన్ బ్యాటర్లలో హజ్మత్ చేసిన 10 పరుగులే హై స్కోరు కావడం గమనార్హం.

దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జన్ సేన్ మూడు వికెట్లు, స్పిన్నర్ శంసీ మూడు వికెట్లు తీయగా.. రబాడ, నోకియా కట్టడిగా బౌలింగ్ చేసి చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 57 పరుగుల ఛేజింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. క్వింటాన్ డికాక్ 5 పరుగుల వద్ద అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన సౌతాఫ్రికా కెప్టెన్ ఎడెన్ మార్కమ్, ఓపెనర్ హెండ్రిక్స్ నింపాదిగా ఆడి 8.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. మార్కమ్ 23, హెండ్రిక్స్ 29 పరుగులు చేసి టీంను ఫైనల్ కు చేర్చారు.

ఐసీసీ టోర్నీల్లో ఇప్పటి వరకు సౌతాఫ్రికా ఎప్పుడూ కూడా ఫైనల్ చేరకపోగా.. ప్రస్తుతం ఫైనల్ చేరి రికార్డు సృష్టించింది. మొదటి సారి ఫైనల్ చేరడంతో సౌతాఫ్రికా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్నేళ్ల నుంచి ఊరిస్తున్న ఐసీసీ టైటిల్ కు అడుగు దూరంలో ఉంది. ఈ సారి ఎలాగైన ప్రపంచ కప్ గెలవాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఈ టోర్నీలో అఫ్గానిస్తాన్ పోరాటాన్ని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. టాప్ టీంలు అయినా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లను ఓడించడం ఆ జట్టుకు అతి పెద్ద విజయాలుగా చెప్పొచ్చు.  

Exit mobile version