Vande Bharat Train Meal : కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో అందించే ఆహారంపై గత కొన్ని రోజులుగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణ రైళ్లలో కంటే వందే భారత్ లో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఫుడ్ మాత్రం సరిగా ఉండటం లేదని, పాచిపోయిన, పురుగులు పడిన ఆహారం వచ్చిందంటూ ప్రయాణికుల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు అందాయి.
తాజాగా భోపాల్ నుంచి ఆగ్రాకు వెళ్తున్న దంపతులకు వారు ఆర్డరు చేసిన భోజనంలో బొద్దింక వచ్చింది. ప్యాకెట్ తెరిచి చూసేసరికి సాంబారులో బొద్దింక తేలుతూ కనిపించింది. దీంతో వారు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటన జూన్ 18న చోటు చేసుకుంది. దీంతో ఈ విషయాన్ని బాధితులు బొద్దింక ఉన్న ఫుడ్ పార్శిల్ ఫొటోను ఎక్స్ లో షేర్ చేశారు. దీనిపై రెండు గంటల తర్వాత ఐఆర్ సీటీసీ క్షమాపణలు చెప్పింది. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్పై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ‘మీకు కలిగిన అనుభవానికి క్షమాపణలు కోరుతున్నాము. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాం. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ కు తగిన జరిమానా విధించాం’ అని తెలిపింది.