CM Revanth : రైతులకు సీఎం తీపి కబురు.. ఆ లోగా రుణ మాఫీకి హామీ
CM Revanth : కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మరో రెండింటిని మరింత తొందరగా అమలు చేస్తామిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆగస్ట్ 15వ తేదీలోగా అన్నదాతలకు రూ.2 లక్షల రుణమాఫీ, క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ తర్వాతి సీజన్ నుంచి ఇస్తామని హామీ ఇచ్చారు. నారాయణపేటలో సోమవారం జరిగిన ‘జన జాతర’ బహిరంగసభలో సీఎం మాట్లాడారు. ‘లోక్ సభ ఎన్నికల కోడ్ రావడంతో రైతు రుణమాఫీ అమలు చేయలేకపోయాం. నారాయణపేట గడ్డ పైనుంచి మాట ఇస్తున్నా.. రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు ఆగస్ట్ 15వ తేదీలోగా రూ.2 లక్షల రుణమాఫీ అమలుచేసి తీరుతా అని హామీ ఇచ్చారు.
రూ.500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఫ్రీ జర్నీ అమలు చేసినట్లే.. రుణమాఫీ కూడా ఏక కాలంలో, ఏక మొత్తంలో అమలు చేస్తా అని చెప్పారు. వరికి రూ.500 బోనస్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ‘ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం’ అని సీఎం ప్రకటించారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సీఎం తన ప్రసంగంలో అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ లపై మాటల తూటాలు సంధించారాు. ‘జైలులో ఉన్న బిడ్డ కోసం.. ఆమెను కాపాడుకునేందుకు కేసీఆర్.. ప్రధానితో చీకటి ఒప్పందం చేసుకొని, సుపారీ తీసుకున్నారు. బీఆర్ఎస్ ఆత్మగౌరవాన్ని మోడీ వద్ద తాకట్టు పెట్టారు.’
‘మహబూబ్‌నగర్, చేవెళ్ల, భువనగిరి, మల్కాజిగిరి, జహీరాబాద్.. ఈ ఐదు కాంగ్రెస్ పార్టీ గెలిచేవి. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వేయాలని స్వయంగా పెద్ద స్థాయి నయకులు చెప్పడం నీచ రాజకీయాలు కావా?’ అని ప్రశ్నిస్తున్నారు. ‘బీఆర్ఎస్ నేతలు తమ అభ్యర్థుల తరఫు ప్రచారం చేయడం లేదు. కష్టపడి పనిచేస్తున్నా. రేవంత్‌ను దెబ్బతీయాలని బీఆర్ఎస్ ఆలోచిస్తోంది. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు. కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడు.. వారి బిడ్డలే సీఎం కావాలా? మాకేం తక్కువ? నాపై కోపం ఉంటే నాతో కొట్లాడాలి. ధైర్యం ఉంటే గ్రామాలకు వచ్చి ఓట్లు అడగాలి.’ అని సవాల్ విసిరారు.
గద్వాల కోటలో కుతంత్రం
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గద్వాల కోటలో బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ అభ్యర్థి సరితమ్మను ఓడించాయి. అరుణమ్మ నాయకత్వంలో బీజేపీ ఓట్లన్నీ బీఆర్ఎస్ కు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. సరితమ్మ గెలిస్తే యాదవ బిడ్డ మంత్రి అయ్యేది. లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కడున్నారో తెలియదు. ఈ లోక్‌సభ పరిధిలో ఏడుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ప్రచారం చేయట్లేదు. రేవంత్‌ను ఓడించాలని, మోడీని మరోసారి ప్రధానిని చేయాలంటున్న డీకే అరుణను నేను ప్రశ్నిస్తున్నా.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 10 పైసలు ఇచ్చారా? జాతీయ హోదా తెప్పించారా..? కృష్ణా-వికారాబాద్ రైల్వే లైన్ పై కేంద్రంతో మాట్లాడారా? పాలమూరు నుంచి లక్షల మంది వలస వెళ్తేంటే పట్టించుకోలే. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో.. 35 కోట్ల మంది ఆడబిడ్డలకు ఫ్రీ జర్నీ అమలు చేసినందుకు ఓడించాలా? పేదలకు ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందని ఓడించాలా? ఆడ బిడ్డలకు రూ.500కే సిలిండర్ ఇచ్చినందుకు ఓడించాలా? పేదలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నందుకు ఓడించాలా? కాంగ్రెస్ హయాంలో రూ.400 ఉన్న సిలిండర్ ధర మోడీ రూ.1,200కు పెంచినందుకు బీజేపీకి ఓటేయాలా? ఈ మట్టి నాది, గాలి నాది, ప్రజల కష్టం నాది, అనుకొని కష్టాలు తీరుస్తా. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మహబూబ్‌నగర్‌లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కు సిలిండర్ పథకాలను అమలు చేస్తాం.’ అని చెప్పారు.
మంత్రిగా ముదిరాజ్ బిడ్డ..
ఆగస్ట్ లోగా ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తా. మెదక్‌లో నీలం మధు, మహబూబ్‌నగర్‌లో వంశీచంద్‌ను భారీ మెజారిటీతో గెలిపించండి.. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌నే గెలిపించాలి. 10 శాతం జనాభా ఉన్న ముదిరాజ్‌లకు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఒక్క టికెట్ ఇవ్వలేదు. బీసీ-డీ గ్రూప్ నుంచి ‘ఏ’లోకి ముదిరాజులను మార్చే రిజర్వేషన్ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కేసు పెండింగ్ లో ఉండేందుకు కారణం కేసీఆర్ నిర్లక్ష్యమే. ముదిరాజ్‌లు ఈ విషయాన్ని ఆలోచించాలి. మెదక్‌లో నీలం మధుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కేసీఆర్ మాత్రం వెంకట్రామిరెడ్డికి ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. మీ తరఫు ఢిల్లీలో కొట్లాడేందుకు కాంగ్రెస్ అభ్యర్థులను పంపించాలి’ అని పిలుపునిచ్చారు.
ఇందిరమ్మ కమిటీలు వేస్తాం..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం.. అధికారంలోకి రాగానే నారాయణపేట ఎత్తిపోతల పథకానికి నిధులిస్తాం. కృష్ణా-వికారాబాద్ రైల్వే లైన్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పడేసింది. మా ప్రభుత్వం రైల్వే అధికారులతో సర్వే నిర్వహించి ముందుకు తీసుకెళ్తున్నాం. నారాయణపేట అండర్‌గ్రౌండ్ డ్రైనేజి తెచ్చేది మేమే. లోక్‌సభ ఎన్నికలు కాగానే.. 2 నెలల్లోనే స్థానిక ఎన్నికలు ఉంటాయి. పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత నాది. కష్టపడేవారికే పదవులకు అవకాశం కల్పిస్తాం.
కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటాం. ఇందిరమ్మ కమిటీల్లో వారికి అవకాశం ఇస్తాం. మీ ద్వారా పేదలకు పథకాలు అమలు చేస్తాం. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ 2 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలవాలి. కాంగ్రెస్ కార్యకర్తల కృషి, ప్రజల ఆశీర్వాదంతో పాలమూరులో 14కు 12 అసెంబ్లీ సీట్లు సాధించింది. కార్యకర్తల కృషితోనే సీఎం అయ్యా. కానీ బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయి. కార్యకర్తలు పెంచిన చెట్టును నరికేందుకు ఢిల్లీ నుంచి ఒకరు, ఫాంహౌస్ నుంచి మరొకరు వస్తున్నారు. మీ చెట్టును మీరే కాపాడుకోవాలి. అందుకు సిద్ధమేనా? కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎమ్మెల్యే ఎన్నికలకు ఎక్కువ కష్టపడాలి. ఏమరుపాటుగా ఉంటే నష్టం’ అంటూ పార్టీ శ్రేణులకు రేవంత్ ఉద్బోధించారు. ఈ సభలో అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పర్నికారెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, గద్వాల జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత, నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆయన హయాంలో అసెంబ్లీలో ఈ విషయంపై ప్రశ్నిస్తే.. తనను, సంపత్‌కుమార్‌ను కేసీఆర్ సభ నుంచి గెంటి వేయించారు. కాంగ్రెస్ విప్ గ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ను నియమించాం. పాల్వాయి రజనీని టీఎస్‌పీఎస్సీ సభ్యురాలిగా, సంగీతను నా పేషీలో అధికారిగా నియమించాం. మాదిగల ఆవేదన నాకు తెలుసు. కాంగ్రెస్ నియామకాల్లో న్యాయం చేసి సముచిత బాధ్యత కల్పిస్తా. సోనియాను ఒప్పించి పార్లమెంటులో వర్గీకరణ చట్టం చేసే బాధ్యత కాంగ్రెస్ ది. అని రేవంత్ చెప్పారు.