CM Revanth : ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ మీద పోరాటం చేస్తున్నారు. తాజాగా సినిమా పరిశ్రమకు కొన్ని కీలక సూచనలు చేశారు. మంగళవారం పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన వాహన శ్రేణి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన సభలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమకు కొన్ని కండిషన్స్ పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ నివారణకు సినిమా ఇండస్ట్రీ తోడ్పడాలంటూ సూచించారు. సమాజాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై సినిమాకు ముందు డిస్ క్లెయిమర్స్ ప్రదర్శించాలన్నారు. సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు, కానీ వీటి పై అవగాహన కల్పించడం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇకమీదట ఎవరైతే సినిమా టికెట్ రేట్లు పెంచాలని కోరుతూ ప్రభుత్వం వద్దకు వస్తారో.. వారి నుంచి ఆ సినిమాలో నటించిన స్టార్ల చేత డ్రగ్స్ అవగాహన వీడియో చేయించి రిలీజ్ చేయించాలని అప్పుడే టికెట్ రేటు పెంచుకునే అవకాశం కల్పించేలా ఒక ప్రీ కండిషన్ పెడుతున్నట్టు ఆయన ప్రకటించారు. డ్రగ్స్, సైబర్ నేరాలు పై సినిమా కు ముందు కానీ సినిమా తరువాత అయిన మూడు నిమిషాల వీడియోతో అవగాహాన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తి లేదన్నారు. అలాంటి నిర్మాతలకు , డైరెక్టర్లకు, నటీనటులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవన్నారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాల విషయంలో సినిమా థియేటర్ల యాజమాన్యాలు కూడా సహకరించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాలు పై థియేటర్లలో ప్రసారం చేయకపోతే వాటి అనుమతి విషయంలో కూడా పునరాలోచించాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.