CM Revanth : టీఎస్ ను తొలగించి టీజీగా మారుస్తారా?
CM Revanth : తెలంగాణ పేరును ఆంగ్లంలో టీఎస్ గా చేశారు బీఆర్ఎస్ నేతలు. అప్పుడు టీఆర్ఎస్ గా ఉన్న పార్టీకి టీఎస్ కలిసి వస్తుందనే ఉద్దేశంతో టీఎస్ గా మార్చారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో అసువులు బాసినా వారి గురించి ఏనాడు పట్టించుకోలేదు. వారి స్వార్థమే పరమావధిగా చేసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా ఫోకస్ పెట్టింది. తెలంగాణ ఇచ్చింది మేమే. తెచ్చింది మేమే అనే అర్థం వచ్చేలా టీఎస్ పేరును మార్చే యోచనలో ఉన్నారు.
టీఎస్ పేరును టీజీగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాన్ని సవరించి టీజీ చేస్తామని ప్రకటించారు. రేవంత్ ప్రతిపాదనపై తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న వారిలో సానకూలత వస్తోంది. ఎన్నికల ముందే రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే మార్పులు ఉంటాయని స్పష్టం చేయడం తెలిసిందే.
తెలంగాణ సెంటిమెంట్ తోనే రెండు సార్లు అధికారం చేపట్టిన టీఆర్ఎస్ తరువాత పార్టీని బీఆర్ఎస్ గా మార్చింది. తెలంగాణ సెంటిమెంట్ ను కాదని పేరు మార్చుకోవడంతోనే విమర్శలు ఎదుర్కొంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని చెప్పి కనీసం రాష్ట్రంలో కూడా చక్రం తిప్పలేక చతికిల పడిపోయింది. దీంతో కాంగ్రెస్ విజయం సాధించి బీఆర్ఎస్ కు షాకిచ్చింది.
తెలంగాణ ఏర్పడిన తరువాత టీఎస్ కోడ్ తో తెలంగాణ స్టేట్ వచ్చేలా చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత టీజీ అని పెట్టుకోవాలని కేసీఆర్ భావించినా టీఎస్ కూడా బాగానే ఉందనే ఉద్దేశంతో అలాగే కంటిన్యూ చేశారు. అప్పటి నుంచి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు టీఎస్ కోడ్ తో వచ్చాయి. అదే ఇప్పుడు కూడా రన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి దాన్ని టీజీగా మార్చాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.