CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణ మాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సభలో ఆయన మాట్లాడుతూ రుణ మాఫీపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. పంద్రాగస్టు లోపు భద్రాద్రి రాముడి సాక్షిగా రైతులకు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులని అన్నారు. ఈ జిల్లాలకు పోరాటాల గడ్డగా పేరుందన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. మే 9 వరకు రైతులందరికీ రైతుబంధు నిధులు జమ చేస్తామని.. అప్పటి వరకు రైతుబంధు పడని ఏ ఒక్క రైతు ఉన్నా తాను అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ చివరికి బీజేపీలో చేరతారని జోస్యం చెప్పారు.