Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విధంగానే శుక్రవారం జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో `ప్రజాదర్బార్`ను ప్రారంభించి తన దూకుడు చూపించారు. ఉదయం ప్రజాభవన్ వద్దకు వచ్చిన ప్రజల నుంచి సీఎం రేవంత్ స్వయంగా ఆర్జీలను స్వీకరించారు. క్యూలైల్లో ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
శుక్రవారం నుంచి ప్రజాదర్బార్‌ను ప్రారంభిస్తున్నట్లు గురువారం ఎల్బీస్టేడియం సాక్షిగా ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే శుక్రవారం ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రజాభవన్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లో ప్రజల వినతిపత్రాల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ తరువాత క్యూలైన్లలో వారిని లోపలికి పంపించారు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం 12 గంటలకు సీఎం సచివాలయానికి వెళ్లనున్నారు. విద్యుత్ శాఖపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.