CM Revanth : పరిపాలనపై పట్టుబిగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth : తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోడానికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని ఎత్తులు వేశారు. ఎట్టకేలకు పదేళ్ల అధికారంలో ఉన్న గులాబీ అధినేత కేసీఆర్ ను గద్దె దించి తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకు కూడా తన శైలి ఏమిటో చూపించారు. అదేవిదంగా అధిష్టానం వద్ద తన హోదాను దక్కించుకున్నారు. రాష్ట్రంలో పరిపాలన పగ్గాలు చేత పట్టిన వెంటనే పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. అప్పటికే కొంత వరకు తన పరిపాలన అంటే ఏమిటో అధికారులు, ప్రతిపక్ష పార్టీలకు రుచి చూపించారు. జూన్ నాలుగున పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఆయన ఆశించిన ఫలితాలు దాదాపు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఒకవేళ ఢిల్లీలో ఇండియా కూటమి ఏర్పడితే సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి పదవులు ఇప్పెంచే పనిలో ఉంటారు. ఆ తర్వాత ఆయన రాష్ట్ర పరిపాలనపై పూర్తిస్థాయిలో పట్టుబిగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే ఆర్టీసీ లోగో మార్చి వేశారు. రైతు బందు పథకాన్ని రైతు భరోసా గ మార్చి వేశారు. మనబడి పథకాన్ని అమ్మ ఆదర్శ పాఠశాలలుగా పేరు మార్చారు. ధరణి వ్యవస్థ లో ఉన్న లోపాలను సరిదిద్దే అవకాశం కూడా కనబడుతోంది.
బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల వ్యవస్థను కూడా మార్చబోతున్నట్టుగా పుకార్లు వస్తున్నాయి. కొత్త జిల్లాలతో ప్రభుత్వానికి ఆర్థిక భారమైనది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల సమాచారం. భూమి రిజిస్ట్రేషన్ విలువలు కూడా హెచ్చు, తగ్గులు ఉన్నాయి. వీటిని సవరించాలని ఈ పాటికే ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర మంత్రి వర్గంలో కూడా మార్పులు, చేర్పులు ఉంటాయని కూడా పుకార్లు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వద్దనే పలు కీలక శాఖలు ఉన్నాయి. వాటిని కూడా మంత్రి పదవులు ఆశిస్తున్న వారికి కట్టబెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. స్థానిక ఎన్నికల నాటికి ప్రభుత్వం పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఏర్పడే విధంగా పరిపాలనను నిర్మించే అవకాశాలు కనబడుతున్నాయి. అదే విధంగా పీసీసీ పదవి కూడా తన ఆధీనంలోనే ఉంది. ఆ బాధ్యత కూడా మరొకరి చేతిలో పెట్టె అవకాశం కూడా ఉంది.