CM Revanth : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రశంసలు కురిపించింది. బీజేపీపై రేవంత్ చేస్తున్న విమర్శలకు ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మంచి స్పందన వస్తోందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆరోపణలు చేశారు. దీంతో దీనిపై బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ సైతం ఉలిక్కి పడుతోంది.
రేవంత్ రెడ్డి లేవనెత్తిన రిజర్వేషన్ల అంశంతో కాంగ్రెస్ కు మేలు జరిగే అవకాశాలున్నాయి. దీంతో రేవంత్ రెడ్డిని మరిన్ని సభల్లో మాట్లాడించాలని చూస్తోంది. ఈ మేరకు కార్యాచరణ కూడా రూపొందిస్తోంది. ఆర్ఎస్ఎస్ ఎజెండా కూడా రిజర్వేషన్లు రద్దు చేయడమేనని చెబుతుండటంతో బీజేపీలో తడబాటు మొదలైంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చలు జరిగితే బీజేపీ ఓటు బ్యాంకుకు దెబ్బే అంటున్నారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ అగ్రనేతలు సైతం క్లారిటీ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. దీనిపై జాతీయ స్థాయిలో పెద్ద రచ్చ జరుగుతోంది. అటు ఉత్తర, ఇటు దక్షిణ భారతదేశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇది కాంగ్రెస్ కు మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఏఐసీసీ నేతలు కూడా రేవంత్ రెడ్డిని అభినందించినట్లు సమాచారం.
రిజర్వేషన్ల విధానంపై బీజేపీని ఇరుకున పెట్టే విధంగా రేవంత్ రెడ్డి మాటలు ఉండటంతో మంచి స్పందన లభిస్తోంది. ఈ విషయంలో రేవంత్ కు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం సూచనలతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి బీజేపీని సందిగ్ధంలో పడేసే ఇంకా ఏం ప్రణాళికలు రచిస్తున్నారో తెలియడం లేదు.
కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెంచేందుకు రేవంత్ రెడ్డి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. బీజేపీని డైలమాలో పడేసే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి కొత్త తరహా ప్రచారం ముందుకు తీసుకువస్తున్నట్లు సమాచారం. బీజేపీని ఎంత మేర నిలువరిస్తారో చూడాల్సిందే.