Sonia Gandhi : తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం సోనియాగాంధీతో భేటీ అయ్యారు. జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని ఆమెను ఆహ్వానించారు. ఆవిర్భావ వేడుకలకు తప్పకుండా వస్తానని సోనియా గాంధీ చెప్పినట్లు సీఎం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలి రాష్ట్ర అవతరణ వేడుకలు కావడంతో ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్చనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను తెలంగాణ గీతంగా ప్రకటించారు.
రాష్ట్రమంతా అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించాలని ప్రణాళిక చేస్తున్నారు. ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ సాధనలో పనిచేసిన వాళ్లను ఘనంగా సన్మానించాలని భావిస్తున్నారు. ఇదే వేదికపై రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ వేడుకను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.