CM Revanth:ఢిల్లీకి సీఎం రేవంత్..మంత్రుల శాఖలపై రానున్న క్లారిటీ
Telangana CM Revanth:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. నేరుగా పార్లమెంట్‌కు వెళ్లి ఆయన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఇక గురువారం తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పెద్దలు, అశేష అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల సాక్షిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మంత్రులుగా 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రుల శాఖలు ఇవే అంటూ జోరుగా ప్రచారం జరిగింది.
అయితే అందులో ఎలాంటి నిజం లేదని, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలు కేటాయించలేదని తెలిసింది. మంత్రుల శాఖలపై స్పష్టత కోసం సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. అక్కడ పలువురు కాంగ్రస్ పెద్దలను రేవంత్ కలవనున్నారు. ఇవాళ రాత్రికే ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. అంతే కాకుండా మరో ఆరుగురు మంత్రులుగా ఎవరిని నియమిస్తే బాగుటుంది అనే అంశాలపై అధిష్టానంతో ముఖ్యమంత్రి చర్చించనున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.
అంతే కాకుండా రేపు ఉదయం 8:30 గంటలకు ప్రొటెం స్పీకర్ చేత రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరు దాదాపుగా ఖరారు అయింది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ స్వేత పత్రం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలని ప్రభుత్వం సభ ముందు బట్టబయలు చేయనుంది. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు.