CM Revanth Decisions : ఆ పార్టీ ఆనవాళ్లు చెరిపివేసేలా..తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు..
CM Revanth Decisions : బీఆర్ఎస్ ను గద్దె దించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనలో తనదైన మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఆరు గ్యారెంటీల అమలుతో పాటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆనవాళ్లను చెరిపిసే ప్రయత్నం చేస్తోంది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోని ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వంలో వారి సేవలను వాడుకోవాలని చూస్తోంది.
కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేస్తోంది. తాజాగా మరో రెండు హామీల అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, 10న బడ్జెట్ ప్రవేశ పెట్టాలని తీర్మానించింది. ఈ సమావేశాల్లోనే పై రెండు హామీల అమలుపై ప్రకటన చేయనుంది.
కేబినెట్ తీర్మానంలో మరో కొన్ని ముఖ్య విషయాలకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర చిహ్నం రాజరిక పాలనను గుర్తు చేసేలా ఉందని.. దాన్ని రూపుమాపేలా మన ప్రాంతపు గుర్తులు కనిపించేలా తెలంగాణ పోరాటం, అందులో జైలుకెళ్లిన వారిని జ్ఞప్తికి తెచ్చేలా రాచరిక పునాదుల నుంచి త్యాగానికి, పోరాటాలకు ప్రతిరూపంగా తెలంగాణ సంస్కృతిని, జీవన విధానాన్ని, కళారూపాలను ప్రతిబింబించేలా మార్పు చేయాలని నిర్ణయించారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహ రూపంలోనూ మార్పు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ పునర్నిర్వంచించుకోవాలని తీర్మానించింది. కవులు, కళాకారులు, మేధావులు, ప్రజలు అభిప్రాయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రజా కవి అందెశ్రీ రాసిన ‘‘జయ జయహే తెలంగాణ’’ పాటను రాష్ట్ర అధికార గీతంగా చేస్తూ ఆమోదం తెలిపింది.
ఇక వాహన రిజిస్ట్రేషన్ల చట్టంలో కూడా మార్పు చేయనున్నారు. ‘టీఎస్’ పేరును ఇక నుంచి ‘టీజీ’గా మార్చనున్నారు. ఇందుకోసం వాహనాల రిజిస్ట్రేషన్ చట్టంలో సవరణలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన పార్టీ పేరును ప్రతిబింబించేలా ‘టీఎస్’ అని పెట్టడంపై ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడే కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇప్పుడు దాన్ని టీజీగా మార్పు చేయాలని నిర్ణయించడం గమనార్హం.