CM Revanth-Chandrababu : సీఎం రేవంత్, బాబు రహస్య భేటీ..మీడియా సంస్థపై కేసు
CM Revanth-Chandrababu : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టులో రహస్యంగా కలిశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బేగంపేట విమానాశ్రయంలో దాదాపు వీరిద్దరూ రెండు గంటల పాటు చర్చించుకున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు కలిశారన్న వార్తలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డిపై తప్పుడు కథనం రాసిన ఓ మీడియా సంస్థపై వివిధ సెక్షన్ల పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు సమాచారం. దీంతో ఏ మీడియా సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారన్నది జర్నలిస్ట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రేవంత్, చంద్రబాబు గురుశిష్యులు అని మనకు తెలిసిందే. చంద్రబాబు డైరెక్షన్ లోనే రేవంత్ వెళ్తారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో రేవంత్ ను కాంగ్రెస్ లోకి పంపించిందే చంద్రబాబు అని కూడా ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తుంటాయి. తెలంగాణ ప్రజలు చంద్రబాబును ఎప్పుడూ తెలంగాణ ద్రోహిగానే చూస్తారు. కానీ తెలంగాణకు సీఎంగా ఉన్న రేవంత్ ..చంద్రబాబుతో భేటీ అయ్యారంటే ఇక్కడి ప్రజలు సహించరు అనే విషయం తెలిసిందే. అలాగే రేవంత్ ది కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. అంటే రేవంత్, చంద్రబాబు ఇద్దరూ ప్రత్యర్థి పార్టీలకు చెందినవారే. కానీ వీరిద్దరి మధ్య రహస్య భేటీ అంటూ కొన్ని మీడియాల్లో వార్తలు రావడం గమనార్హం.