CM Mohan Charan Majhi : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి ఒడిశాకు మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ఎన్నికై చరిత్ర సృష్టించారు. ప్రాంతీయ పార్టీ అయిన బిజూ జనతాదళ్ (బీజేడీ)కి బలమైన కోటరిగా ఉన్న ఒడిశా రాష్ట్రానికి 15వ ముఖ్యమంత్రిగా మాఝీ జూన్ 15వ తేదీ (శనివారం) ప్రమాణ స్వీకారం చేశారు. మాఝీ గిరిజన వర్గానికి చెందినవాడు. కియోంజర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాఝీ లా గ్రాడ్యుయేట్, ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు.
రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు 300 కి.మీ దూరంలో ఉన్న చంపువా చంద్రశేఖర్ కాలేజీ నుంచి అతను బ్యాచిలర్ ఆర్ట్స్ (BA) పట్టా పొందాడు. 1977లో స్థాపించిన ఈ కళాశాల మహారాజా శ్రీరామ చంద్ర భంజా డియో యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది. మాఝీ తన గ్రాడ్యుయేట్ డిగ్రీని 1993లో పొందాడు. మాఝీ కూడా ప్రసిద్ధ ధెంకనల్ లా కాలేజీ నుంచి లా గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నారు. 1981 లో స్థాపించిన ఈ కళాశాల శాశ్వతంగా ఉత్కల్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతోంది.
సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మాఝీ చదువును ఎప్పుడూ పక్కన పెట్టలేదు. ఝుంపురా సరస్వతీ శిశు మందిరంలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. సరస్వతీ శిశు మందిర్ అనేది భారతదేశంలోని పాఠశాలల్లో అతిపెద్ద నెట్‌వర్క్. ఇది భారతీయ సంస్కృతి, విలువలతో కూడిన విద్యను అందిస్తుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఏర్పాటు చేసిన పీఠం ద్వారా కొనసాగే ఈ పాఠశాలలు విద్యార్థుల్లో విద్యాపరమైన, నైతిక వృద్ధిని పెంపొందించడం ద్వారా సంపూర్ణ అభివృద్ధి, నైతిక విద్య, సంస్కృతం ప్రమోషన్‌ను నొక్కి చెబుతాయి.
నివేదికల ప్రకారం, మాఝీ ‘సంతాల్ తెగ’కు చెందినవాడు. సంతాల్ తెగ భారతదేశంలోని అతిపెద్ద గిరిజన వర్గాల్లో ఒకటి, ప్రధానంగా జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిషా, అస్సాం రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. వారి సుసంపన్నమైన సంస్కృతిక వారసత్వానికి గుర్తింపు పొందిన సంతాల్ సంతాలీ అని పిలిచే ఒక ప్రత్యేక భాష, సంగీతం, నృత్యం, కళల సంప్రదాయాన్ని కలిగి ఉన్నారు. వారి పండుగలు, సోహ్రాయ్, బహా వంటివి ప్రకృతి, వ్యవసాయం చుట్టూనే ఉంటాయి. చారిత్రాత్మకంగా, 1855-56 నాటి సంతాల్ తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా వారి ప్రతిఘటనకు సంతాల్‌లు గుర్తింపు పొందారు. వారి ప్రధాన ఆదాయం వ్యవసాయమే. వారి పూర్వీకుల భూములు, సంప్రదాయ పద్ధతులతో మమేకం అయి ఉంటారు.
53 ఏళ్ల ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, 1992లో రాయికాల సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2000లో తొలిసారి ఒడిశా శాసన సభకు ఎన్నికయ్యారు. సాధారణ జీవితం గడిపిన మాఝీ ఎక్కువగా పుస్తకాలతోనే దోస్తీ చేసేవారు. ఆయన ఉండే ఇల్లు, పరిసరాలు ప్రకృతితో అనుసంబంధం కలిగి ఉంటాయి. ఇంటి ముందు ఫోన్ చూస్తున్న వ్యక్తే మన ఒడిశా సీఎం చరణ్ సింగ్ మాఝీ.