CM Jagan : ‘‘నేను పక్కకు తప్పుకుంటే..’’ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

CM Jagan

CM Jagan

CM Jagan : ఏపీ అభివృద్ధి కోసం తాను పనిచేస్తుంటే కొందరు వెనక్కి లాగాలని చూస్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అలాంటి మారీచులతో తాను యుద్ధం చేస్తున్నానని తెలిపారు. జగన్ అనే వ్యక్తి తప్పుకుంటే పేదలకు ఇచ్చే పథకాలన్నీ నీరుగారిపోతాయని ప్రజలను హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మవద్దన్నారు. ప్రతీ ఇంటికి కేజీ బంగారం, బెంజ్ కార్లు ఇస్తామని కూడా ప్రచారం చేస్తారన్నారు. ఇలాంటి కళ్లబొల్లి మాటలు నమ్మవద్దని, పేదల కోసం పనిచేసిన తనను గుర్తుపెట్టుకోవాలని కోరారు.

ఏపీ సీఎం జగన్ శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో పాల్గొని నిధులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న 9.44లక్షల మంది విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన కింద 708.68 కోట్ల రూపాయలను విడుదల చేశారు. బటన్ నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ అకౌంట్లలో పూర్తి రీయింబర్స్ మెంట్ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు.

మీ ఫీజులు మీరే కట్టుకోండి అన్న గత ప్రభుత్వ విధానాలకు స్వస్తి పలికామని, పిల్లలు ఇబ్బందులు పడకూడదని వెంటనే ఫీజులు చెల్లిస్తున్నామన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం తెస్తే చంద్రబాబు, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ బడులు బాగుపడాలనుకోవడం తప్పా అని జగన్ ప్రశ్నించారు. విద్యారంగంలో పేదలు ఎదగాలని మార్పు తెస్తుంటే ఇంతమందితో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు.

మనల్ని విమర్శిస్తున్న వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో వారినే అడగాలన్నారు. వాళ్ల పిల్లలు, మనవళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు.. పేదవారు ఇంగ్లిష్ మీడియంలో చదివితే తెలుగు జాతి అంతరించిపోతుందని అంటున్నారు. వాళ్ల పిల్లల చేతుల్లో ట్యాబ్ లు ఉండొచ్చు.. మన పిల్లల చేతుల్లో ట్యాబ్ లు ఉంటే చెడిపోతున్నారని యాగీ చేస్తున్నారని ఆరోపించారు.

TAGS