CM Jagan : ఏపీలో మరో రెండు, మూడు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారాయి. అన్ని పార్టీల్లో కెల్లా జగన్ పార్టీ దూకుడే ఎక్కువగా కనపడుతోంది. సీఎం జగన్ అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. అలాగే నేటి నుంచి ప్రచార పర్వానికి నాంది పలుకనున్నారు. విశాఖ పట్టణంలోని భీమిలి నియోజకవర్గంలోని సంగివలస నుంచి ఆయన ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, క్యాడర్ కు ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు.
సీఎం జగన్ ‘వైనాట్ 175’ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈమేరకు శ్రేణులతో ముందుగా మమేకం కావడానికి ‘సిద్ధం’ సభను నిర్వహిస్తున్నారు. ఈ రోజు భీమిలి సముద్ర తీరాన జన హోరు కనిపించేలా ఆ పార్టీ ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈసభలో కార్యకర్తలతోనూ మాట్లాడించనున్నారు. వారి అభిప్రాయాలను సభా వేదిక నుంచే జగన్ తెలుసుకోనున్నారు. ఏపీ ప్రస్తుత రాజకీయాలు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలు, పొత్తుల వ్యవహారాలపై శ్రేణులకు వివరిస్తూ..ఎన్నికల కార్యారంగంలోకి వారిని దించే ప్రయత్నం చేయబోతున్నారు.
అలాగే 56 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక న్యాయం గురించి కూడా వివరించబోతున్నారు. జగన్ నిర్వహించే సాధారణ సభల కంటే భిన్నంగా నిర్వహించబోతున్నారు. జగన్ ర్యాంప్ వాక్ చేయనున్నారు. సభకు లక్షలాది మందిని తరలించేలా ఉత్తరాంధ్ర నేతలు ప్లాన్ చేశారు. ఈ సభలో జగన్ ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి.
అయితే గత కొన్ని రోజులుగా షర్మిల తనను బాగా టార్గెట్ చేస్తుండడంతో ..సభ వేదిక నుంచి ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎన్నికలకు సమర శంఖారావం పూరించే సభ కావడంతో జగన్ ప్రసంగంపై శ్రేణులు ఉత్కంఠగా ఉన్నాయి. రాబోయే ఎన్నికలకు అధికార పార్టీ పెడుతున్న మొదటి సమాయత్త సభ కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ బిగ్ టర్న్ అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.