CM Jagan-Narayana Murthy : సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలను నిర్మించే ఆర్. నారాయణమూర్తికి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరుంది. అలాంటి నారాయణమూర్తికే సీఎం జగన్ ఝలక్ ఇచ్చారు. తాను పుట్టిన ప్రాంతంపై ప్రేమతో సాగునీటి ప్రాజెక్టు కోసం జగన్ అధికారం చేపట్టిన తర్వాత నారాయణమూర్తి ఆయనను కలిశారు. సాగునీటి ప్రాజెక్టు తన చిరకాల స్వప్నమని సీఎంకు నారాయణమూర్తి వివరించారు. దీంతో ఆ ప్రాజెక్టును జగన్ మంజూరు కూడా చేశారు. సీఎం ప్రాజెక్టును మంజూరు చేసిన తర్వాత జగన్ కు నారాయణమూర్తి చేతులెత్తి మొక్కారు. త్వరలోనే ప్రాజెక్టు పూర్తవుతుందనుకున్నారు.
కానీ, ఆ ప్రాజెక్టు ఇప్పటి వరకు కాగితాలపైనే ఉంది. ఉమ్మడవి తూర్పు గోదావరి జిల్లాలోని ఏలేరు, ఉమ్మడి విశాఖ జిల్లాలోని తాండవ జలాశయాల కాలువలను అనుసంధానిస్తే రెండు ఉమ్మడి జిల్లాలో కొత్తగా 5,600 ఎకరాల ఆయకట్టు సాకులోకి వస్తుంది. 51,465 ఎకరాల ఆయకట్టు స్థిరీకరన జరుగుతుంది. 2021లో ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.470 కోట్లు మంజూరు చేసి 2021 మార్చి 19న పాలనాపరమైన అనుమతులను ఇచ్చింది. టెండర్లు పిలిచి.. కాంట్రాక్టరును ఎంపిక చేసింది. ఆ తర్వాత ఆ ప్రాజెక్టుకు మిగతా సాగునీటి ప్రాజెక్టులకు పట్టిన గతే పట్టింది.