CM Chandrababu : వాలంటీర్లకు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు గత ప్రభుత్వం పేపరు కొనుగోలు కోసం ఇస్తున్న పేపర్ అలవెన్స్ ను రద్దు చేశారు. తాజాగా పత్రికా కొనుగోలు ఉత్తర్వులను రద్దు చేస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసింది.
ఏపీలో జూలై 1న పింఛన్ల పంపిణీ జరగనుంది. వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు వేల రూపాయలతో పాటు మూడు నెలలకు సంబంధించి పెండింగ్ రూ.3000 తో కలిపి.. మొత్తం రూ.7000 అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఒక విధంగా జగన్ కు షాక్ ఇచ్చే అంశమే. ఆది నుంచి పింఛన్ల మొత్తాన్ని పెంచే విషయంలో చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు మరోసారి పింఛన్ మొత్తాన్ని రూ.3000ల నుంచి 4వేల రూపాయలకు పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని సామాజిక పింఛన్ లబ్ధిదారుల అభిమానాన్ని పొందుతున్నారు.
ఏపీలో సంక్షేమానికి ఆధ్యుడు నందమూరి తారక రామారావు. అయితే ఆయన హయాంలో పింఛన్ మొత్తాన్ని 75 రూపాయలు అందించేవారు. అటు తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సైతం దానిని కొనసాగించారు. 2003లో ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సామాజిక పింఛన్ మొత్తాన్ని 75 రూపాయల నుంచి 200కు పెంచుతానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మాటను వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలబెట్టుకున్నారు. పింఛన్ మొత్తాన్ని 200 రూపాయలకు పెంచారు. అయితే 2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశారు చంద్రబాబు. తాను అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని వెయ్యి రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసి చూపించారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పింఛన్ మొత్తాన్ని రెండు వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. కానీ చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఒకేసారి 1000 నుంచి 2000 రూపాయలకు పింఛన్ మొత్తాన్ని పెంచి ఆశ్చర్యపరిచారు.
2019 ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు. పింఛన్ మొత్తాన్ని పెంచుకుంటూ పోతూ రూ.3000 అందిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ పోయారు. 2024 నాటికి మూడు వేల రూపాయల పింఛన్ లబ్ధిదారులకు అందించగలిగారు. ఈ ఎన్నికలకు ముందు కూడా జగన్ పింఛన్ మొత్తాన్ని పెంచుతానని హామీ ఇచ్చారు. రూ.3,500 కు పెంచుతానని.. అధికారంలోకి వచ్చిన తర్వాత 250 రూపాయలు, 2028 తర్వాత మరో 250 రూపాయలు పెంచుతానని చెప్పుకొచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చిన మరుక్షణం పింఛన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. పెంచిన మొత్తాన్ని ఏప్రిల్ నెల నుంచి వర్తింప చేస్తానని.. జూలై 1న రూ.4000 తో పాటు మూడు నెలల పెండింగ్ కు సంబంధించి.. మొత్తం రూ.7000 అందిస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే జూలై 1న పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆది నుంచి పింఛన్లను పెంచిన ఘనత చంద్రబాబుకు దక్కుతుండడం జగన్ కు రుచించని విషయం.