CM Chandrababu : ఐదేళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు. పాలన పై ఆయన పూర్తి దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త ప్రభుత్వంలో అమరావతి – పోలవరం తన ప్రాధాన్యత అంశాలుగా సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతి తొలి విడత నిర్మాణాల కోసం రూ.38 వేల కోట్ల మేర నిధులు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్దిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. అటు కేంద్రం నుంచి కూడా రాజధానికి నిధులు ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. దీంతో సొంతంగా నిధుల సమీకరణకు కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు.
రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతో అమరావతి నిర్మాణానికి ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుండి కావాల్సిన నిధులను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే బ్యాంకుల నుండి భారీగా రుణాలు తీసుకోవడంతో.. మళ్లీ వాటినుండి నిధుల సమీకరణ దాదాపుగా సాధ్యం కాదని తెలుస్తోంది. దీంతో ప్రత్యామ్నాయంగా ప్రైవేటు పెట్టుబడుల అంశం తెరపైకి వచ్చింది. నిధుల సమీకరణలో ఎన్‌ఆర్‌ఐలకు పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఎలాగైనా వారి సహకారం తీసుకోవాలని భావిస్తుంది. సింగపూర్, అమెరికాతో పాటు పలు ఇతర దేశాలకు చెందిన సంస్థలతో కూడా చర్చలు జరపాలని సర్కార్ భావిస్తోంది. వీటితో పాటు రాజధాని ప్రాంతంలో తమ ఆఫీసులను ప్రారంభించాల్సిందిగా పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలను కోరాలని భావిస్తోంది. ఈ రెండిటికోసం పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. గతంలోనే రాజధానిలో ఎపిఎన్‌ఆర్‌టి భవనానికి రాయపూడి వద్ద స్థలం కేటాయించారు. దాని ద్వారా కూడా ఇప్పుడు నిధుల సేకరణపై దృష్టి సారించినట్లు తెలిసింది. పెట్టుబడులకు సంబంధించిన కంపెనీల వివరాలను ఇప్పటికే సీఆర్డీఏ సిద్ధం చేసింది.
అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై వారం పదిరోజుల్లో సీఆర్డీఏ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం నిధుల కోసం వేట ప్రారంభిచనున్నట్లు తెలిసింది. అమరావతి ప్రాజెక్టుకు కనీసం రూ.43 వేల కోట్ల అవసరం ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికిరూ.15 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లకు పిలిచారు. వీటిల్లో దాదాపు తొమ్మిది వేల కోట్ల మేర పనులు మొదలయ్యాయి. కొన్ని నిలిచిపోయాయి. ఇప్పుడు అమరావతిలో ప్రాజెక్టులకు కనీసం రూ.10 వేల కోట్ల అవసరం ఉంటుందని భావిస్తున్నారు.