CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ఆర్థిక స్థితిపై చర్చలు జరిపారు. గత ఐదేళ్లుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిందో ఎన్ని అక్రమాలు జరిగాయో వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం సాయం చేయకుండా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పినట్లు సమాచారం.
కేంద్రమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశ వివరాలను ఎక్స్ వేదికగా చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తగిన ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో ఉన్న పరిస్థితులు, విభజన తర్వాత జరిగిన పరిణామాలు, ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.