Chandababu: సింగ్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి పర్యటించిన సీఎం చంద్రబాబు
Chandababu: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. విజయవాడ నగరం సింగ్ నగర్ లో వరద బాధితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. సీఎం చంద్రబాబు ఆదివారం అర్ధరాత్రి వారి దగ్గరకు వెళ్లి ఆహార పదార్థాలు అందజేశారు. అధికారులతో కలిసి బోటులో తిరుగుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్ కు చేరుకున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి సహాయ చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ‘సింగ్ నగర్ లో పరిస్థితులపై పర్యవేక్షించా. బాధితులు అందరికీ న్యాయం చేస్తాం. బాధితులకు ఆహార ప్యాకెట్లు అందజేశాం. ప్రజలు ధైర్యంగా ఉండాలి. నిరంతరం సహాయక చర్యలు కొనసాగుతాయి’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
అర్ధరాత్రి 1.10 గంటలకు కృష్ణలంకలోని 16వ డివిజన్ పోలీసు కాలనీలో పర్యటించారు. రక్షణ గోడ వద్ద వరద నీటిని పరిశీలించారు. త్వరలో సాధారణ స్థితి నెలకొంటుందని, ధైర్యంగా ఉండాలని వరద బాధితులకు ధైర్యం చెప్పారు. మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, అనిత, ఎంపీ చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, కృష్ణ ప్రసాద్, కలెక్టరు సృజన తదితరులు పాల్గొన్నారు.