CM Chandrababu : అనంతపురం-అమరావతి, హైదరాబాద్-అమరావతి హైవేల నిర్మాణంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సమావేశమైన అనంతరం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై చర్చించారు.
అనంతపురం-అమరావతి, హైదరాబాద్-అమరావతి హైవేల నిర్మాణం త్వరితగతిన సాకారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని సీఎం కోరినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తో పాటు పలువురు రాష్ట్ర ఎంపీలు పాల్గొన్నారు.