CM Chandrababu : సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే ఒక్క నిమిషం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనలో అన్ని రంగాల్లో కుదేలైన రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు తనదైన ప్రయత్నాలు చేస్తున్నారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం..తదితర అభివృద్ధి కార్యక్రమాలను పట్టాలెక్కించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు ఆయన అహోరాత్రులు కష్టపడుతున్నారు. దానికి ఏమేం చేయాలో అన్ని చేస్తున్నారు. తాజాగా ఏపీ రాష్ట్రానికి నిధులు, విభజన సమస్యల పరిష్కారంపై ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, ఇతర మంత్రులను కలిశారు.
చంద్రబాబు ఢిల్లీ టూర్ పై జాతీయ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వెలువడుతున్నాయి. ఎన్టీఏలో కీలకనేత అయిన సీఎం చంద్రబాబు కేంద్రం ముందు పలు డిమాండ్లు పెట్టినట్టు ఎకనామిక్ టైమ్స్, బ్లూమ్ బర్గ్ వెల్లడించాయి. రాష్ట్రంలో రాజధాని నగరాన్ని నిర్మించడానికి, ఇతర ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి లక్ష కోట్లకు పైగా నిధులు కేటాయించాలని కోరారట. అయితే ఆర్థిక సాయం అందించేందుకు మోదీ కూడా సూత్రప్రాయంగా అంగీకరించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ఆ మీడియా సంస్థలు తెలిపాయి. అందులో ఈ కింది అంశాలు ఉన్నట్లు తెలిసింది.
– మార్చి 2025 నాటికి ఆర్థిక సంవత్సరానికి అదనంగా 0.5 శాతం రుణాలు తీసుకోవడాన్ని అనుమతించడం ద్వారా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 3 శాతం ఆర్థిక లోటు పరిమితిని పెంచడం. అది దాదాపు రూ.7వేల కోట్లకు సమానం.
-అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.50వేల కోట్లు, ఇందులో ఈ సంవత్సరంలో రూ.15 వేల కోట్లు కేటాయించాలని కోరారట. పోలవరం ప్రాజెక్టుకు ఈ ఆర్థిక సంవత్సరంలో 12 వేల కోట్లు అడిగారట. అప్పులను క్లియర్ చేసేందుకు వచ్చే ఐదేళ్లలో రూ.15వేల కోట్లు కేటాయించాలన్నారట. అలాగే కేంద్రం 50 ఏళ్ల రుణ పథకం కింద మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.10వేల కోట్లు అడిగినట్టు సమాచారం.
అయితే ఈ విషయమై టీడీపీ వర్గాలు కూడా స్పందిస్తున్నాయి. రాష్ట్ర విభజన, జగన్ రెడ్డి పాలన వల్ల రాష్ట్రం ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, వాటన్నంటినీ అధిగమించాలంటే కేంద్రం సాయం చేయక తప్పదని అంటున్నారు. అందుకే చంద్రబాబు లక్ష కోట్ల నిధులు కేటాయించాలని కోరినట్టు వార్తలు వెలువడుతున్నాయి.