JAISW News Telugu

KTR : జర్నలిస్ట్ శంకర్ పై హత్యాయత్నం వెనక సీఎం? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

KTR-Journalist Shankar

KTR

KTR-Journalist Shankar : తెలంగాణలో రాజకీయాలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పద్ధతిగానే ఉంటాయనే పేరుంది.  హత్యా రాజకీయాలు, దాడులు, తీవ్ర దూషణలు ఉండవు. కానీ ఇటీవల కాలంలో  ఈ పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. ప్రశ్నించిన వారిపై దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జర్నలిస్ట్ శంకర్ పై హత్యాయత్నం జరిగింది. ఆదివారం సాయంత్రం తుర్కయంజల్ లోని శంకర్ ఇంటికి వెళ్లి కేటీఆర్ పరామర్శించిన అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు.

శంకర్ పై జరిగిన దాడికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డే వహించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో జర్నలిస్ట్ శంకర్ కు ఎలాంటి హాని జరిగినా దాని పూర్తి బాధ్యులు రేవంత్ రెడ్డే అవుతారని హెచ్చరించారు. కొడంగల్ లో రైతులకు సంబంధించిన భూముల కబ్జాల విషయాన్ని బయటకు తీసుకొచ్చినందుకే శంకర్ పై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారన్నారు. నిజాలను నిర్భయంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న శంకర్ పై, రాజ్యాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసులను అడ్డుపెట్టుకుని అంతమొందించాలన్న ఈ ప్రభుత్వ ప్రయత్నం అదృష్టవశత్తూ విఫలమైందన్నారు. భవిష్యత్తులో శంకర్ పైన దాడులకు తెగబడితే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. శంకర్ పై పకడ్బందీగా గత కొద్ది రోజులుగా రెక్కి నిర్వహించి మరీ పదుల సంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ గూండాలు ఆయన్ను అంతమొందించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అయితే స్థానికులు, సీసీ కెమెరాల సాక్ష్యంగా ఉండడంతో వారి కుట్ర ఫలించలేదన్నారు.

శంకర్ లేవనెత్తుతున్న ప్రశ్నలను తట్టుకోలేకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనపై దాడికి తెగబడిందని ఆరోపించారు. శంకర్ ను అంతమొందించేందుకు భౌతికంగా దాడి చేసినా, స్థానిక పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా అలసత్వం, పక్షపాత వైఖరిపైన ప్రధాన ప్రతిపక్షంగా అవసరమైన కార్యాచరణ చేపడుతామన్నారు. ఈవిషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డీజీపీని కోరారు. తమ ప్రభుత్వ హయాంలో సీఎంను, సీఎం కుటుంబ సభ్యులపై, ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడిన అనేక అసత్య ప్రచారాలు చేసినా ఏనాడూ భౌతిక దాడులకు పాల్పడలేదన్నారు.

Exit mobile version