Jindal Industry : కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
Jindal Industry : విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ ఉక్కు కర్మాగారాన్ని యాజమాన్యం మూసివేసింది. అందులో పనిచేస్తున్న 57 మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది. పరిశ్రమకు ప్రధాన ముడి సరకు అందుబాటులో లేకపోవడం, ఉత్పత్తులకు మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నట్లు యూనిట్ హెడ్ దినేశ్ శర్మ విడుదల చేసిన నోటీసులో పేర్కొన్నారు. జిందాల్ పరిశ్రమను తెరవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు, నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన గేటు ఎదుట నిరసన తెలిపారు. యాజమాన్యానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఈ చర్యలతో కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాపోయారు. పరిశ్రమ మూసివేతతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిందాల్ యాజమాన్యంతో కార్మిక సంఘాలు జరుపుతున్న చర్చలు ముగిశాయి. ఒడిశా జార్జ్పూర్ యూనిట్లో పని కల్పిస్తామని యాజమాన్యం తెలిపింది. వేతనం పెంచాలని, అక్కడి కార్మికుల నుంచి ఇబ్బంది రాకుండా చూడాలని కార్మికులు యాజమాన్యాన్ని కోరారు. ఈ నెల మొత్తానికి జీతాలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేయగా, డిమాండ్లపై సోమవారం నిర్ణయం ప్రకటిస్తామని యాజమాన్యం తెలిపింది.