Amaravati : అమరావతిలో క్లీనింగ్ స్టార్ట్!

Amaravati

Amaravati

Amaravati : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఐదేళ్ల జగన్‌ పాలనలో పేరుకుపోయిన చెత్త, చెత్త నిర్ణయాలను ఊడ్చేయడం ప్రారంభమైంది. ముందుగా చెత్త పన్ను పేరుతో జగన్‌ ప్రభుత్వం చేసిన దోపిడీని తక్షణం నిలిపివేయాలని సంబంధిత అధికారులకు సీఎం ఆఫీస్ నుంచి జిల్లా స్థాయి కార్యాలయాలకు ఉత్తర్వులు అందాయి. దీంతో ఈ నెల నుంచి రాష్ట్రంలో ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయడం లేదు.

వైఎస్ జగన్ సీఎంగా ఉన్న హయాంలో ఎన్టీఆర్ పేరును తొలగించి తన తండ్రి పేరును ఏర్పాటు చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్‌ స్థానంలో వైఎస్సార్ అని బోర్డులను పెట్టించాడు. ఇప్పుడు మళ్లీ వైఎస్సార్ బోర్డలను తొలగించి వాటి ప్లేస్ లో మళ్లీ ఎన్టీఆర్‌ పేరున ఉన్న బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)తో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో వాటి అధికారిక వెబ్‌సైట్లలో జగన్‌, మంత్రుల ఫొటోలు తొలగించి వాటి స్థానంలో చంద్రబాబు నాయుడు ఫొటోలను ఇప్పటికే ఏర్పాటు చేశారు.

మరోపక్క ఫలితాలు వెలువడిన (జూన్ 4) వెంటనే సీఆర్‌డీఏ అధికారులు అమరావతిలో క్లీనింగ్ పనులు ప్రారంభించారు. సుమారు 70 జేసీబీలు, లారీలు ఉపయోగిస్తూ రాజధాని ప్రాంతంలో పెరిగిన పిచ్చి మొక్కలను, పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని వేగంగా తొలగిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం హయాంలో పాడుబడిన భవనాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 11.27 గంటలకు గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐ‌టిటీపార్కులో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు సమాచారం అందడంతో, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ శుభ్రం చేస్తున్నారు. మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో వేగంగా పనులు చేపడుతున్నారు. బాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వీలైతే ప్రధాని తో సహా చాలా మంది ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నందున పట్టణం మొత్తం అందంగా కనిపించాలని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

TAGS