TPCC Chief Mahesh Kumar : వరదల నివారణకే మూసీ నది ప్రక్షాళన: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
TPCC Chief Mahesh Kumar Goud : వరదల నివారణకే మూసీ నది ప్రక్షాళన చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గట్టిగా వర్షం పడితే హైదరాబాద్ ఎక్కడికక్కడ స్తంభిస్తుందన్నారు. హైదరాబాద్ భవిష్యత్ కోసమే తాము ముందుకెళ్తున్నామని, వయోనాడ్ పరిస్థితి హైదరాబాద్ కు రావద్దన్నారు. వరదల వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏంటని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. గ్లోబల్ వార్మింగ్ గురించి బీఆర్ఎస్ నేతలకు ఆలోచన లేదన్నారు. మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ మేనిఫెస్టోలో లేదా..? ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయాలని చూస్తే హైడ్రా ఉందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మూసీలో ఇప్పటి వరకు పేదల గుడిసెలు ఒక్కటి కూడా కూల్చలేదని చెప్పారు. మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. హైడ్రాను ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఆక్రమణలను తొలగిస్తే తప్ప హైదరాబాద్ కు సేఫ్టీ లేదన్నారు. ప్రతి పేదవాడిని అన్ని రకాలుగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదోడు కష్టాల్లో ఉంటే అండగా ఉండే పార్టీ కాంగ్రెస్సేనని టీపీసీసీ చీఫ్ వెల్లడించారు.