JAISW News Telugu

Rohit Vemula : రోహిత్‌ వేముల కేసులో వారికి క్లీన్‌చిట్‌..

Rohit Vemula

Rohit Vemula

Rohit Vemula : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ వేముల సూసైడ్ కు ఎవ్వరూ కారణం కాదని మార్చి 21న కోర్టుకు ఇచ్చిన క్లోజర్ లో పేర్కొన్నాడు. కులధ్రువీకరణ పత్రం సరైంది కాదనే విషయం బయటకు పడితే ఇబ్బంది కలుగుతుందని భావించి 2016, జనవరి 17న హాస్టల్‌ రూమ్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని సూసైడ్ చేసుకొని ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ ఎస్సీ కాదని అతడి కుటుంబం బీసీ-ఏ (వడ్డెర)కు చెందినవారని.. వారు అక్రమంగా ఎస్సీ సర్టిఫికెట్ పొందారని.. జిల్లా స్థాయి స్ర్కూటినీ కమిటీ తేల్చినట్లు వెల్లడించారు.

ఈ కేసులో బీజేపీ, ఏబీవీపీ నేతలతో పాటు నాటి వీసీ అప్పారావుకు అతడి ఆత్మహత్యతో ఎలాంటి సంబంధం లేదని క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఈ కేసులో తమపై ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని అభ్యర్థిస్తూ అప్పారావు, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్‌ రామచంద్రరావు, ఏబీవీపీ నాయకులు పెట్టుకున్న పిటీషన్లను కోర్టు శుక్రవారం డిస్పోజ్‌ చేసింది. హెచ్‌సీయూలో 2015లో.. ఏబీవీపీ, అంబేడ్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఏఎస్ఏ) మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో.. వర్సిటీ కుల రాజకీయాలకు, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందంటూ నాటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ ద్వారా వివరించాడు.

ఆ సమయంలోనే వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సిఫారసుతో.. ఐదుగురు విద్యార్థులపై వీసీ బహిష్కరణ వేటు వేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వీసీతో పాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తమకు రోహిత్ సూసైడ్ కు ఎలాంటి సంబంధం లేదని.. తమ కేసు కొట్టేయాలని వారు పిటీషన్లు వేసుకున్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ ధర్మాసనం విచారణ చేపట్టి ఐదుగురికి క్లీన్ చీట్ ఇచ్చింది. పోలీసుల క్లోజర్‌ రిపోర్టు ప్రకారం.. రోహిత్‌ సూసైడ్ తో వారికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ విచారణ ముగిస్తున్నట్లు వెల్లడించింది.

రోహిత్‌ వేముల మరణంపై తెలంగాణ పోలీసుల నివేదికను నిరసిస్తూ హెచ్‌సీయూ క్యాంప్‌లో పలు విద్యార్థి సంఘాలు శుక్రవారం రాత్రి నిరసన తెలిపాయి. వర్సిటీలోని ఏఐవోబీసీఏ, ఏఐఎస్ఏ, ఏఎస్ఏ, బీఎస్ఎఫ్‌, డీఎస్‌యూ, ఫ్రెటర్నిటీ, ఎంఎసెఫ్‌, టీఎ‌స్‌ఎఫ్‌, హెచ్‌సీయూ స్టూడెంట్స్‌ భారీ ర్యాలీ తీశారు. తెలంగాణ పోలీసులు ఏబీవీపీ, బీజేపీకి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వడం అన్యాయమని, ఆ నివేదిక తప్పులతడక అని ధ్వజమెత్తారు. ఈ తీర్పుపై రోహిత్‌ వేముల తల్లి, మరికొందరికి సందేహాలు ఉండడంతో తదుపరి దర్యాప్తునకు అనుమతి కోరుతూ త్వరలో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని ఆయన వెల్లడించారు.

Exit mobile version