Tamil Nadu : ఆలయ ఉత్సవాల్లో ఘర్షణ
Tamil Nadu : తమిళనాడులోని సేలం జిల్లా తీవట్టిపట్టిలో గురువారం నిర్వహించిన ఆలయ ఉత్సవాలలో షెడ్యూల్ కులాల వారికి, ఆధిపత్య కులానికి చెందిన వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. షెడ్యూల్డు కులాల వారిని పండుగలో పాల్గొనడానికి, ఆలయంలోనికి ప్రవేశించడానికి అనుమతించక పోవడంతో ఈ ఘర్షణ జరిగిందని ప్రాథమిక నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలై ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పాటు అక్కడ ఉన్న దుకాణాలకు నిప్పు పెట్టారు. చాలా దుకాణాలు కాలి బూడిదయ్యాయి. రాళ్ల దాడిలో అయిదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘర్షణతో సేలం-బెంగళూరు జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని దుకాణాలపై దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.