CJI question : మరణశిక్షపై సీజేఐ ప్రశ్న.. ఏఐ లాయర్ సమాధానం ఏమిటంటే?
CJI question to AI Lawyer : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఏఐ లాయర్ పనితీరును పరీక్షించారు. ఈ నేపథ్యంలో ఓ ప్రశ్న అడిగారు. నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏర్పాటైన వర్చువల్ లాయర్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ విధంగా ప్రశ్నించారు. మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనా..? అని అడిగారు. దానికి ఏఐ లాయర్ ‘‘అవును. భారత్ లో మరణశిక్ష రాజ్యాంగబద్ధమైనది. అత్యంత ఘోరమైన నేరాల్లో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇస్తుంది. అరుదైన కేసుల్లో దీనిని విధిస్తారు’’ అని ఆ ఏఐ లాయర్ బదులిచ్చారు. ఆ సమాధానం ప్రధాన న్యాయమూర్తిని మెప్పించింది. కళ్లజోడు, టై, కోటు ధరించిన అచ్చం న్యాయవాది రూపంలో ఉన్న ఆ ఏఐ లాయర్ వీక్షకులను ఆకట్టుకున్నారు.
ఏఐ సాంకేతికతతో ఫలానా పని చేసేలాగా కంప్యూటర్లకు శిక్షణ ఇవ్వవచ్చు. అందుకు అవసరమైన డేటాని అందించడమే మన పని. ఆ డేటా ఎంత ఎక్కువ ఉంటే అంత కచ్చితమైన ఫలితం ఉంటుంది. కృత్రిమమేధ సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు, రాయగలవు, మాట్లాడగలవు.. మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలుగుతున్నాయి. కాబట్టి వాటికి ఆ పనులు అప్పజెప్పి మనుషులు అంతకన్నా పై స్థాయిలో.. సృజనాత్మకత, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన.