Chiranjeevi CM Candidate : ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వ్యూహాలు మరింత రాటుదేలుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు సాధించడం ఇటు జగన్ కు అటు చంద్రబాబు, పవన్ లకు అత్యంత కీలకం. అందుకే ప్రతీ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్ర పోషిస్తుండగా..పార్టీలో అభ్యర్థులకు ఏ ఇబ్బంది రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాయకుల్లో విభేదాలను ముందే గుర్తించి వారిని ఐక్యంగా ఉంచడంలో పార్టీల అధిష్ఠానాలు చొరవ తీసుకుంటున్నాయి. ఇక వైసీపీ.. టీడీపీలోని కీలక నేతల నియోజకవర్గాలను టార్గెట్ చేసి వారిని ఈ సారి ఓడించేలా వ్యూహాలు పన్నుతోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా తాను బరిలో ఉన్నానంటూ తెరపైకి వేగంగా ముందుకొస్తోంది. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరికతో ఆ పార్టీకి కొద్దిగా మైలేజీ వచ్చినట్టైంది. వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి నుంచి టికెట్ రాని వారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక టీడీపీ,జనసేనతో కలిసి బీజేపీ పొత్తు విషయమై ఎలాంటి పురోగతి లేదు. బీజేపీ నుంచే స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ కొత్త వ్యూహాన్ని రూపొందిస్తోంది. ఇండియా కూటమి బంధాన్ని ఏపీలోనూ కొనసాగించాలని భావిస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి పార్టీ నుంచి కీలక ఆఫర్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఏపీ త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ సింగిల్ గానే బరిలోకి దిగుతోంది. టీడీపీ-జనసేన కూటమి మ్యానిఫెస్టో తయారీ, సీట్ల ఖరారుపై తలమునకలై ఉంది. బీజేపీతో తమతో కలిసి వస్తుందని కూటమి నేతలు ఆశిస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో తన పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా పార్టీలో చేరిన షర్మిలకు రాష్ట్ర పగ్గాలు అందించాలని హైకమాండ్ భావిస్తోంది. అయితే హర్షకుమార్ లాంటి సీనియర్ నాయకులు కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ టైంలో కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ కీలక ప్రతిపాదన చేయడం విశేషం.
గతంలో యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చిరంజీవి.. తిరిగి కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని ఆయన కోరారు. చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేయాలని సూచించారు. చిరంజీవి కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఉంటారని చెప్పుకొచ్చారు. చిరంజీవి కాంగ్రెస్ కు ఇంకా రాజీనామా చేయలేదని ఆయన ఎమ్మెల్యేగా తిరుపతి నుంచి 50వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని, సీఎం అవుతారని జోస్యం చెబుతున్నారు. చింతా మోహన్ కామెంట్స్ ఇలా ఉండగా.. చిరంజీవి తాను ఇక రాజకీయాల్లో రానని గతంలోనే చెప్పారు.
చిరంజీవి సోదరులు ఇద్దరూ జనసేనలో ఉన్నారు. వారు టీడీపీతో కలిసి కూటమిగా జగన్ ఎదుర్కొబోతున్నారు. అయితే చిరంజీవి.. పవన్ కల్యాణ్ గురించి ఎన్నోసార్లు తన తమ్ముడు కీలక పదవిని చేపట్టబోతున్నాడని ఆకాంక్షించారు. తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. కాగా, ఏపీ రాజకీయాలు ఎవరూ ఊహించనట్టుగా మారుతుండడంతో.. మళ్లీ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది.